News

అశోక్ సింఘాల్ జన్మ శత జయంతి సందర్భంగా లోగో ఆవిష్కరించిన VHP

2views

న్యూఢిల్లీ : విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ జన్మ శత జయంతి నేపథ్యంలో VHP ఓ ప్రత్యేక లోగోను ఆవిష్కరించింది. అశోక్ సింఘాల్ జన్మ శత జయంతిని సందర్భంగా ఆయన జీవితం, సమాజానికి చేసిన కృషి, సాంస్కృతిక సేవలను స్మరించుకోవడానికి ఈ ప్రత్యేక లోగోను రూపొందించారు. ఇదే విషయంలో VHP అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్దా మాట్లాడుతూ.. అశోక్ సింఘాల్ ఆధ్యాత్మిక విలువలు, హిందూ సమాజంలో ఆయన తీసుకొచ్చిన చైతన్యం, హిందూ సమాజాన్ని మేల్కొలిపిన తీరు, భారతీయ సంస్కృతికి ఆయన జీవిత కాలం చేసిన సేవను ఈ లోగో ప్రతిబింబిస్తుందని తెలిపారు.

లోగోపై ఉన్న “అశోక్ సింఘాల్ జీ” అనే పదాలు గౌరవభావనను వ్యక్తపరుస్తుండగా, “జన్మ శతాబ్ది సంవత్సరం 1926–2015” అనేది ఆయన జీవితకాలం గురించి తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 27, 2026 నాటికి ఆయన జన్మించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ లోగోను విడుదల చేశారు; ఇది ఆయన ఆలోచనలు, అంకితభావం, కృషిని యువతరానికి చేరవేసే ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ లోగో నేపథ్యం కాషాయ రంగుతో వుంటుంది. కాషాయం అంటే త్యాగానికి ప్రతీక. అలాగే దానిపై రామ మందిరం, దానిపైన కాషాయ ధ్వజం, అలాగే అశోక్ సింఘాల్ ఫోటో వుంది. వీటితో ‘‘శ్రద్ధేయ అశోక్ సింఘాల్, జన్మ శతాబ్ది వర్ష్ 1926-2015’’ అని రాసి వుంది. అయితే.. ఈ లోగోలో వుంచిన అయోధ్య శ్రీ రామ మందిరం అశోక్ సింఘాల్ జీవితంలోని ప్రధాన లక్ష్యాలలో ఒకటి. అలాగే రామ జన్మభూమి ఉద్యమానికి ఆయన చేసిన పోరాటం, అందించిన సేవలకు గుర్తుగా వుంది. అలాగే కాషాయ ధ్వజం అనేది మన హిందూ సనాతన సంప్రదాయానికి, సంఘటిత శక్తికి, త్యాగ నిరతికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.

లోగో మధ్యలో ఉంచిన అశోక్ సింఘాల్ యొక్క ప్రశాంతమైన, తేజోవంతమైన మరియు సౌమ్యమైన వ్యక్తిత్వం ఆయన ఆధ్యాత్మిక విలువలు, దృఢ సంకల్పం, సంస్థాగత నైపుణ్యాలు, సాధువుల పట్ల గౌరవం మరియు హిందూ సమాజం పట్ల ప్రగాఢమైన ప్రేమను ప్రతిబింబిస్తుందని వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు.ఈ లోగో కేవలం ఒక దృశ్యరూప చిహ్నం మాత్రమే కాదని, అశోక్ సింఘాల్ జీ జీవిత సందేశానికి ఒక ప్రతీకాత్మక సమ్మేళనమని అభివర్ణించారు.