
శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించే భక్తులను సైబర్ మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా https://ttdevasthanam.online నకిలీ వెబ్‌సైట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో టీటీడీ స్పందించింది. నకిలీ వెబ్సైట్ను వెంటనే తొలగించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భక్తులకు టీటీడీ సేవలు, దర్శనం, వసతి, ఆన్‌లైన్ టికెట్లకు సంబంధించి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in, ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
టీటీడీ నకిలీ వెబ్‌సైట్ (ttddevasthanam.online)ను విజిలెన్స్ విభాగం గుర్తించింది. అధికారిక ఆన్‌లైన్ సేవలను పోలి ఉండేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారని టీటీడీ పేర్కొంది. కేవలం డొమైన్ పేరులో స్వల్ప మార్పులతో నకిలీ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ నకిలీ వెబ్‌సైట్‌లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు సమాచారం చేరవేస్తున్నట్లు గమనించామని టీటీడీ వెల్లడించింది.
దర్శన టికెట్ల పేరుతో భక్తుల నుంచి నగదు వసూలు చేయడం, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీయడమే ఈ నకిలీ వెబ్‌సైట్ ఉద్దేశమని దేవస్థానం పేర్కొంది. ఈ నకిలీ వెబ్సైట్ను వెంటనే తొలగించాలని సంబంధిత డొమైన్ ప్లాట్‌ఫారమ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. టీటీడీ సేవలు, దర్శనం, వసతి, ఆన్‌లైన్ టికెట్లకు సంబంధించి భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్, అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్‌లు చేసుకోవాలని ఈ సందర్భంగా భక్తులకు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనధికారిక వెబ్‌సైట్లు, లింకులను నమ్మి మోసపోవద్దని సూచించింది.
భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు : మరోవైపు తిరుమలలో దర్శనాలు, గదుల పేరిట సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే ప్రకటించింది. టీటీడీ విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో సామాజిక మాధ్యమాల్లో ‘శ్రావణ్ కళ తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం’ ఐడీతో భక్తులను మోసగిస్తున్న చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామసాని పవన్ కుమార్ అలియాస్ నాగరాజు, బోడిరెడ్డి చెన్నకేశవులును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
సమాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు : ఇటీవలి కాలంలో తిరుమలలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక మాధ్యమాల ద్వారానే దర్శనాలు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది. ఎవరైనా తిరుమలలో దర్శనాలు, గదులు ఇప్పిస్తామని చెబితే నమ్మకూడదని భక్తులకు సూచించింది. అలాంటి వ్యక్తుల సమాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నంబర్ 98668-98630కు ఫిర్యాదు చేయాలని పేర్కొంది.




