
ధ్వని కాలుష్య నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా ఆచరిస్తోంది హర్యానా పోలీసు విభాగం. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను వంద శాతం అమలు చేసేలా చూడాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు హరిద్వార్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
ఇందులో భాగంగా పోలీసులు తమ తమ పోలీసు స్టేషన్ల పరిధిలో మతపరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను తనిఖీ చేశారు. నిర్ణీత ధ్వని పరిమితి కంటే ఎక్కువ శబ్దంతో నడుస్తున్న 63 లౌడ్ స్పీకర్లను నిర్మొహమాటంగా తొలగించేశారు. అలాగే భవిష్యత్తులో కూడా తమ అనుమతి లేకుండా, నిర్ణీత ధ్వని ప్రమాణాల కంటే ఎక్కువ లౌడ్ స్పీకర్లను ఎవ్వరూ ఆపరేట్ చేయవద్దని పోలీసులు హుకూం జారీ చేశారు.
సంబంధిత వ్యక్తులు/మేనేజర్లు/కమిటీలకు ధ్వని కాలుష్య (నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ) నిబంధనలు, న్యాయస్థానం ఉత్తర్వులు, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించినట్లు ఎస్ఎస్పీ నవనీత్ భుల్లర్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత చట్టాలు మరియు నిబంధనల ప్రకారం హరిద్వార్ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.





