News

వీర్ల గంగమ్మ ఆలయంపై గ్రానైట్ వ్యర్థాల డంపింగ్ నిలిపివేయాలి: బీజేపీ యువ మోర్చా హెచ్చరిక

34views

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని స్థానిక వీర్లకొండపై వెలసిన శ్రీ వీర్ల గంగమ్మ తల్లి దేవాలయం సమీపంలో గ్రానైట్ క్వారీ నిర్వహణ వల్ల ఆలయ మనుగడకు ముప్పు ఏర్పడుతోందని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కమదాని శ్రీరాం ఆందోళన వ్యక్తం చేశారు.

దేవాలయం పైభాగంలో గ్రానైట్ వ్యర్థాలను డంపింగ్ చేయడం వల్ల ఆలయ పరిసరాలు దెబ్బతింటున్నాయని, ఇది హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

స్థానిక ఎస్‌ఆర్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం వెంటనే దేవాలయం సమీపంలో వ్యర్థాల డంపింగ్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భక్తులు, గ్రామస్తులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

హిందూ దేవాలయాల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన కమదాని శ్రీరాం, ధర్మ పరిరక్షణకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు. ఈ అంశంపై గ్రామగ్రామాన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని విస్తృత స్థాయిలో చేపడతామని తెలిపారు.

స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సంబంధిత అధికారులు, క్వారీ యాజమాన్యం తక్షణమే స్పందించి దేవాలయ రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.