News

మధ్యప్రదేశ్‌లో యూసీసీ బిల్లు దిశగా అడుగులు..

39views

భోపాల్: మధ్యప్రదేశ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. అయితే, కట్ని జిల్లాలో జరిగిన ఓ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

“రాష్ట్రంలో ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికే చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా ఉన్నప్పుడు వివిధ వర్గాలకు వేర్వేరు వ్యక్తిగత చట్టాలు ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. అందరికీ సమానమైన చట్టం ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

“రాముడు ఒకే వివాహం చేసుకున్నప్పుడు.. రహీమ్‌కు రెండు, మూడు, నాలుగు వివాహాలు ఎందుకు ఉండాలి? ముస్లిం మహిళలు కూడా మన సోదరీమణులే. ప్రతిపాదిత యూసీసీ చట్టం ప్రకారం ఒకే వివాహం చేసుకున్న వ్యక్తికే రాష్ట్రంలో చట్టపరమైన గుర్తింపు ఉంటుంది” అని మోహన్ యాదవ్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుత చట్టాల ప్రకారం తక్షణ ట్రిపుల్ తలాక్‌కు అవకాశం లేదని సీఎం పేర్కొన్నారు. ఎవరైనా తలాక్ చెప్పే విధానాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భోపాల్‌లోని జగదీష్‌పూర్‌లో జరగనున్న తదుపరి క్యాబినెట్ సమావేశంలో యూసీసీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి, అనంతరం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు.