
మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), పోలీసులు కలిసి ఒక పెద్ద ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు. మన దేశంలో పూర్తిగా నిషేధించిన పాకిస్తానీ కాస్మెటిక్ ఉత్పత్తులను భారీగా అమ్ముతున్నట్లు అధికారులకు రహస్య సమాచారం అందింది. ఈ సమాచారంతో గురువారం రాత్రి నాందేడ్ లోని మన్యార్ గల్లీ ప్రాంతంలో ఉన్న ఒక దుకాణం, గోదాముపై అధికారులు అకస్మాత్తుగా దాడులు చేశారు. ఈ సోదాల్లో భారతదేశంలో నిషేధించిన దాదాపు 38 రకాల పాకిస్తానీ సౌందర్య ఉత్పత్తులు బయటపడ్డాయి. పట్టుబడిన ఈ మొత్తం సామాగ్రి విలువ సుమారు 50 నుండి 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం చాటున గుట్టుచప్పుడు కాకుండా దందా
ఈ దాడుల్లో వెలుగుచూసిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సదరు నిందితుడు బయట ప్రపంచానికి టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నట్లు నమ్మిస్తూ, లోపల మాత్రం ఈ నిషేధిత ఉత్పత్తుల దందా సాగిస్తున్నాడు. ‘అఫ్రా జనరల్ స్టోర్స్’ అనే దుకాణంలో పాకిస్తాన్ లో తయారైన బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఇటువంటి ప్రమాదకరమైన ఉత్పత్తులను విక్రయించేవారిపై ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పట్టుబడిన ఈ ప్రొడక్ట్స్ లో ఎలాంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయో తెలుసుకోవడానికి అధికారులు నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. ఇంత పెద్ద మొత్తంలో నిషేధిత సామాగ్రి అసలు నాందేడ్ వరకు ఎలా వచ్చింది, దీని వెనుక ఎంతమంది పెద్ద నెట్వర్క్ ఉందనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.





