News

ప్రకృతి వ్యవసాయంపై .. గుంటూరులో కెన్యా ప్రతినిధుల అధ్యయనం

11views

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF) అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కెన్యా దేశానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం గ్రామాన్ని, అలాగే అత్తోటలోని భూమి భారతి దేశీయ విత్తన సంరక్షణ కేంద్రాన్ని సందర్శించింది.

ఈ బృందంలో సీడ్ సేవర్ నెట్‌వర్క్ కోఆర్డినేటర్ వంజామా న్జోరోగే డేనియల్, స్లో ఫుడ్ కెన్యా అధినేత జాన్ కరియుకి మ్వాంగి, గ్లోబల్ ఫీల్డ్ నెట్‌వర్క్ ప్రతినిధి ఒడ్డా ఫ్రైడే ఒచోమో, సీడ్ సేవర్ నెట్‌వర్క్ సభ్యురాలు జిప్పోరా న్యాంబురా కురియా, న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబికి చెందిన ఇంటర్న్ ప్రసిద్ధ సప్కోటా పాల్గొన్నారు.

ఈ పర్యటనలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, కొల్లిపర మండలం ప్రత్యేక అధికారి పాల్గొని జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను ప్రతినిధులకు సవివరంగా వివరించారు.

జీవ వైవిధ్యంతో కూడిన ఏటీఎం మోడల్ క్షేత్రం పరిశీలన

పర్యటనలో భాగంగా ప్రతినిధులు స్థానిక రైతు భీమరాజుకు చెందిన ఏటీఎం (Agroecological Tree Multilayer) మోడల్ క్షేత్రాన్ని సందర్శించారు. ఒకే పొలంలో వంకాయ, మిరప, టమాటా, కాకర, మామిడి సహా 20కి పైగా వివిధ రకాల పంటలను సమీకృతంగా సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.

క్షేత్రంలో సహజంగా అభివృద్ధి చెందిన మిత్ర కీటకాలు, సూక్ష్మజీవుల పాత్ర, జీవ వైవిధ్యాన్ని కాపాడే సాగు పద్ధతులను చూసి కెన్యా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రసాయనాలు లేకుండా ఏ-గ్రేడ్ అరటి సాగు

అనంతరం రసాయన పురుగుమందులు వినియోగించకుండా సాగు చేసిన ఏ-గ్రేడ్ అరటి మోడల్ క్షేత్రాన్ని వారు పరిశీలించారు. ప్రధాన పంటతో పాటు ఎర పంటలుగా బంతి, ఆముదం వంటి పంటలను సాగు చేసి, వాటి ద్వారా హానికర కీటకాలను ఆకర్షించి సహజ కీటక నియంత్రణ ఎలా సాధిస్తున్నారో రైతులు వివరించారు. ఈ వినూత్న ప్రకృతి వ్యవసాయ విధానంపై ప్రతినిధులు ఆసక్తిగా వివరాలు తెలుసుకుని ప్రశంసలు వ్యక్తం చేశారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు రైతుల సాగు వ్యయాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి దోహదపడుతున్న విధానాలను ఈ సందర్భంగా కెన్యా ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.