News

ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘అల్లూరి స్ఫూర్తి ర్యాలీ’

8views

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శమని, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలను తరతరాలకు గుర్తుచేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి స్మృతి వనంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహం వద్ద శనివారం మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్‌ను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ‘అల్లూరి స్ఫూర్తి ర్యాలీ’ నిర్వహించారు. దేశభక్తి నినాదాలు, అల్లూరి త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొని మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అల్లూరి సీతారామరాజు పేరు తొలి వరుసలో నిలిచిపోతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహనీయుడైన అల్లూరి 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించడం చారిత్రక ఘట్టమని ఆయన గుర్తుచేశారు. ఆ కార్యక్రమం ద్వారా అల్లూరి సీతారామరాజు త్యాగగాథను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తృతంగా పరిచయం చేసే అవకాశం లభించిందన్నారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు అల్లూరి సీతారామరాజు వేషధారణలో విల్లు, బాణాలతో ప్రదర్శన నిర్వహించి సందర్శకులను ఆకట్టుకున్నారు. అలాగే అల్లూరి జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.