
( మే 27 – కందుకూరి వీరేశలింగం వర్ధంతి )
“తన దేహము తన గేహము.. తన కాలము తన ధనంబు తన విద్య.. జగజ్జనులకే వినియోగించిన ఘనుడు వీరేశలింగకవి జనులార” అని చిలకమర్తి లక్ష్మీనరసింహకవి రాసిన పద్యం కందుకూరి వీరేశలింగం పంతులు జీవితానికి అచ్చమైన నిర్వచనం. తన సంపద, సమయం, జ్ఞానం, జీవితమంతా సమాజ శ్రేయస్సుకోసమే అంకితం చేసిన మహనీయుడు వీరేశలింగం. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడిగా, ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడిగా, గొప్ప సంఘసంస్కర్తగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
1848 ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు వీరేశలింగం జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన ఆయనను తల్లి ఎంతో ప్రేమతో పెంచింది. బాల్యంలోనే సమాజంలోని అసమానతలు, మూఢనమ్మకాలు, స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు ఆయన మనసును కలిచివేశాయి. ఆ రోజుల్లో బాల్యవివాహాలు సాధారణం. చిన్న వయస్సులోనే భర్తలను కోల్పోయిన బాల వితంతువులు జీవితాంతం కష్టాలు పడాల్సి వచ్చేది. ఆడపిల్లలకు చదువు అనవసరం అనే భావన సమాజంలో బలంగా ఉండేది. ఈ దురాచారాలను చూసిన వీరేశలింగం “సమాజం మారాలి” అనే సంకల్పంతో ముందుకు వచ్చారు.
వీరేశలింగం జీవితంలో అత్యంత విప్లవాత్మక ఘట్టం వితంతు పునర్వివాహ ఉద్యమం. సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో ఆయన 1881 డిసెంబర్ 11న ఆంధ్రదేశంలో తొలి వితంతు పునర్వివాహాన్ని నిర్వహించారు. ఈ సంఘటన అప్పటి సమాజంలో ప్రకంపనలు సృష్టించింది. సంప్రదాయవాదులు ఆయనను తీవ్రంగా విమర్శించారు. సంఘ బహిష్కరణ చేశారు. ప్రాణహాని హెచ్చరికలు కూడా వచ్చాయి. అయినా వీరేశలింగం వెనక్కి తగ్గలేదు. “అన్యాయాన్ని సహించడం కూడా పాపమే” అనే ధైర్యంతో తన ఉద్యమాన్ని కొనసాగించారు. తన జీవితకాలంలో దాదాపు నలభైకి పైగా వితంతు వివాహాలు జరిపించి ఎన్నో మహిళలకు కొత్త జీవితం ఇచ్చారు.
స్త్రీ విద్యకు వీరేశలింగం చేసిన సేవ అపూర్వం. “ఒక పురుషుడు చదివితే ఒక వ్యక్తి చదివినట్టే.. ఒక స్త్రీ చదివితే ఒక కుటుంబం చదివినట్టే” అనే భావనతో ఆయన మహిళా విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. బాలికల పాఠశాలలు స్థాపించారు. స్త్రీలు విద్యావంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మారు. ఆ రోజుల్లో స్త్రీ విద్యను వ్యతిరేకించిన సమాజంలో ఆయన చేసిన ప్రచారం నిజమైన విప్లవం.
సంఘసేవతో పాటు సాహిత్య రంగంలోనూ వీరేశలింగం అసాధారణ కృషి చేశారు. తెలుగులో తొలి సాంఘిక నవల “రాజశేఖర చరిత్రము” రచించి కొత్త దారిని చూపించారు. తొలి స్వీయచరిత్ర, తొలి ప్రహసనాలు, తొలి వ్యాసరచనలకు ఆద్యుడిగా నిలిచారు. ఆయన రచనలు కేవలం వినోదం కోసం కాదు.. సమాజాన్ని మేల్కొలిపేందుకు ఆయుధాలుగా మారాయి. మూఢనమ్మకాలు, కులవివక్ష, అజ్ఞానం, వేశ్యావ్యవస్థ వంటి సమస్యలను ఆయన తన రచనల ద్వారా తీవ్రంగా విమర్శించారు. అందుకే ఆయనకు “గద్య తిక్కన” అనే బిరుదు లభించింది.
వీరేశలింగం కేవలం రచయిత మాత్రమే కాదు.. గొప్ప జర్నలిస్టు కూడా. “వివేకవర్ధిని”, “సతీహిత బోధిని”, “హాస్యవర్ధిని” వంటి పత్రికల ద్వారా సామాజిక చైతన్యాన్ని పెంపొందించారు. పత్రికలను ఆయన సంస్కరణల వేదికగా ఉపయోగించారు. సమాజంలో వ్యాపించిన అవినీతి, అజ్ఞానం, మూఢనమ్మకాలపై నిరంతరం పోరాడారు.
హితకారిణి సమాజాన్ని స్థాపించి తన ఆస్తినంతా సమాజ సేవకే అంకితం చేశారు. స్త్రీల సంక్షేమం, విద్యాభివృద్ధి, అనాథల సహాయం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సతీమణి రాజ్యలక్ష్మమ్మ కూడా ఈ సంస్కరణోద్యమంలో అండగా నిలిచారు.
1919 మే 27న వీరేశలింగం తుది శ్వాస విడిచినా ఆయన వెలిగించిన సంస్కరణ జ్యోతి ఇంకా వెలుగుతూనే ఉంది. తెలుగు సమాజాన్ని చైతన్యవంతం చేసిన మహానుభావుడిగా, స్త్రీ విముక్తి కోసం పోరాడిన యుగపురుషుడిగా, సాహిత్యంతో సమాజాన్ని మేల్కొలిపిన మహాకవిగా కందుకూరి వీరేశలింగం పేరు తెలుగు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.





