ArticlesNews

సేవామార్గం

34views

జ్వరంతో బాధపడుతున్న నాలుకకు ఆహారం రుచి తెలియనట్లే, లౌకిక సంబంధాల కల్మషంతో సతమతమవుతున్న మనిషి దైవాన్ని అర్థం చేసుకోలేడు. ప్రాచీన కాలం నుంచి మనిషి దేవుణ్ని వెతుకుతూనే ఉన్నాడు. హిమాలయాలకు వెళ్లి తపస్సు చేశాడు. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి గ్రంథాలెన్నో చదివాడు. తీర్థయాత్రలకు వెళ్లాడు, దేవతలను స్తుతించాడు, యజ్ఞయాగాదులు చేశాడు. ఆత్మానుభవం ప్రసాదించమని దేవుణ్ని వేడుకున్నాడు. ఎన్ని చేసినా చాలామంది తాము కోరుకున్న ఆత్మతత్వాన్ని పొందలేకపోతున్నారు. ఎందుకంటే అది ఎక్కడి నుంచో వచ్చేది కాదు. మనలోనే ఉంది. అహంకారం, అనుబంధం అనే మేఘాలు చెదిరిపోయినప్పుడు ఆత్మ అనే సూర్యుడు ప్రకాశిస్తాడు. అప్పుడు మాత్రమే ఈ ఆత్మతత్వం బోధపడుతుంది.

ఆహార సేకరణ, వంట చేయడం, తినడం వంటి పనుల్లోనూ బ్రహ్మ భావనను కలిగి ఉండాలి. ప్రతిదీ దైవానికే అర్పించినట్లు భావించడం ద్వారా, ఆ భోజనం ఒక సాధారణ పనిలా కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందే సాధనగా మారుతుంది. అర్పణే బ్రహ్మం. సమర్పించేది బ్రహ్మకే. దాన్ని సేవించేవాడు, ఆనందించేవాడు కూడా బ్రహ్మే. ఇవ్వడం, తీసుకోవడం, పూజించడం వంటివన్నీ కూడా బ్రహ్మమే. అలా ప్రతిచోటా దేవుడు ఉన్నాడనే అవగాహనను పెంచుకోవాలి. ఈ భావనతో సేవ చేస్తే ‘యద్భావం తద్భవతి- మనం ఎలా ఆలోచిస్తామో అలాగే అవుతాం’ అనే సత్యాన్ని గ్రహిస్తాం. సేవ ఎప్పుడూ సాధనగా ఉండాలి. సేవ చేసేటప్పుడు దేవుణ్ని తప్ప మరెవరినీ తలవకూడదు. ఎవరికి సేవ చేసినా దేవుడికే సేవ చేస్తున్నానని భావించాలి. ఆ క్రమంలో అహంకారాన్ని వదిలించుకోవాలి. దైవాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గం.

భగవంతుణ్ని చేరడానికి అనేక మార్గాలున్నాయి. అయితే భగవత్‌ సాక్షాత్కారానికి దగ్గరి దారి మాత్రం నిస్వార్థంగా సేవ చేయడమే. మనల్ని సంతోషపరుస్తుంది కాబట్టి సేవ చేయాలి కానీ, ఎవరో మనల్ని గుర్తించాలని, ప్రతిఫలం పొందాలని చేయకూడదు. ఎటువంటి అంచనాలు లేకుండా సేవ చేసినప్పుడు అహం, కోరికలు, అనుబంధాలు, అంచనాలు, నిరాశలు ఉండవు. అప్పుడు హృదయం స్వచ్ఛంగా మారుతుంది. దాంతో లోపల ఉన్న దివ్యత్వాన్ని గ్రహించి ఆనందానికి దగ్గరవుతాం. నిజానికి ఈ చర్యల ఉద్దేశం ఏంటంటే మనలోని స్వార్థాన్ని వదిలించుకుని, దివ్యత్వాన్ని అనుభవించడమే. కంట్లో శుక్లం ఉన్న వ్యక్తి కళ్లెదురుగా ఉన్నవాటిని చూడలేడు. అదేవిధంగా అహంకారం, అనుబంధాలతో నిండిన వ్యక్తికి అవి తన మూడో కంట్లో పొరగా మారి, దైవాన్ని చూడనివ్వవు. సేవ అంటే అవసరం ఉన్నవాళ్లకు సాయపడటం. ఈ సేవే అంతర్గతంగా ఉన్న దైవాన్ని చూడటానికి సహాయపడే శస్త్రచికిత్స. సేవలో ఏదైనా ఆశ ఉంటే, దానికి గుర్తింపు కోరుకుంటే ఈ చికిత్స విజయవంతం కాదు. జ్ఞాన నేత్రాలతో ఎవరికి వారు వాస్తవాన్ని గమనిస్తూ, భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే మార్గం మీద అవగాహనతో చేయాల్సిన సాధన ఇది.