News

అడవుల్లోని అన్ని రకాల వృక్ష జాతులను రక్షించుకోవాలి

5views

మన్యంలో అడవి మనకు తల్లి వంటిదని, దానిని అన్ని విధాలా కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లికార్జునరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబందలో సిఫా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో, ప్రజల సహకారంతో నిర్మించిన చెక్‌ డ్యాంను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆదివాసీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. అడవుల్లోని అన్ని రకాల వృక్ష జాతులను మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మనకున్న జలవనరులను రక్షించుకున్నప్పుడే భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, అడవుల పరిరక్షణ మరియు ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చింతపల్లి డీఎఫ్‌వో నరసింహారావు మాట్లాడుతూ, తరతరాలుగా ఆదివాసీలు అడవులనే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ మన్యపు బిడ్డలపైనే ఉందని అన్నారు. అడవులను నాశనం చేస్తే భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి ఏర్పడటమే కాకుండా, జలవనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాజు మాట్లాడుతూ.. నూతిబందలో నిర్మించిన ఈ చెక్‌ డ్యాం ద్వారా సుమారు 150 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. సిఫా ట్రస్ట్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదివాసీలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని కొనియాడారు.