News

ఈనెల 24న ఒంటిమిట్ట ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

132views

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 24న‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మార్చి 24న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసి.. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. మార్చి 27న ప్రారంభం కానున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు.