News

బస్తర్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆదీవాసుల ‘గాయత పఖ్నా’

152views

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజను పరిధిలో గల నారాయణ్‌పుర్‌ జిల్లా కేరళాపాల్‌ గ్రామంలో ఈ నెల 22 నుంచి 25 వరకు ‘గాయత పఖ్నా’ గిరిజన వేడుక ఘనంగా జరిగింది. చనిపోయిన తమ పూర్వీకులకు మోక్షం దక్కాలనే సంకల్పంతో ఉసెండి ఆదీవాసుల తెగ నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ సంప్రదాయ వేడుక 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగింది. జీవనోపాధి కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన వారంతా గ్రామానికి తరలివచ్చారు. ఇందులో మేనమామ తరఫు కుటుంబికులకు ప్రత్యేక ఆహ్వానం పంపి.. డప్పుల చప్పుళ్లు, సంప్రదాయ పాటలతో ఘనంగా స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రికి ఆలపించే విషాద గీతాల్లో మరణించిన పూర్వీకుల పేర్లు, జ్ఞాపకాలను ప్రస్తావిస్తారు. ఈ పాటలను వినడానికి వారి ఆత్మలు వస్తాయని గిరిజనుల నమ్మకం.

రెండోరోజు.. మహిళలంతా కలశాలు మోస్తూ పూజారి వెంట నడిచి, పూర్వీకుల జ్ఞాపకార్థం పాతిన రాళ్ల దగ్గర దీపపు కుండలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మూడోరోజు పురుషులు కొండ పైనుంచి బండరాళ్లను గాయత పఖ్నా స్థలానికి మోసుకొచ్చి పాతిపెడతారు. ఈ రాళ్లకు ఇప్పుపూల రసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగోరోజున వస్తుమార్పిడి పద్ధతిలో గ్రామంలో ప్రత్యేక మార్కెటు ఏర్పాటు చేస్తారు. ఈ మార్కెటు తర్వాత సామాజిక విందుతో పండుగ ముగుస్తుంది.