
ప్రముఖ కవి సంత్ రవిదాస్ ఆలయాన్ని గొప్పగా నిర్మించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆదివారం నిర్వహించిన సంత్ రవిదాస్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దిల్లీలో రవిదాస్ ఆలయాన్ని గొప్పగా నిర్మించేందుకు భాజపా కట్టుబడి ఉందన్నారు. రవిదాస్ తన బోధనల ద్వారా సమాజంలో మూఢనమ్మకాలను తొలగించేందుకు కృషి చేశారన్నారు. సమాజంలో ఐకమత్యంతో ఉండాలని రవిదాస్ చెప్పిన మార్గంలోనే భాజపా కార్యకర్తలు నడుస్తారని చెప్పారు. రవిదాస్ చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి భాజపా కృషి చేస్తోందన్నారు. రవిదాస్ జయంతి నేపథ్యంలో ఆదివారం పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గతంలో దిల్లీలోని తుగ్లకాబాద్‌లో ఉన్న సంత్ రవిదాస్ ఆలయాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూల్చేసిన విషయం తెలిసిందే. దీంతో దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో దళితులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.