
122views
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం చెప్పారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం జేఈవో అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి 4న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, బాదంపాలు నిరంతరాయంగా అందించాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.





