
తమిళనాడు శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్.ఎన్.రవి నిష్క్రమించారు. ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ప్రారంభం కాగా తన ప్రసంగం మధ్యలోనే ఆయన వాకౌట్ చేశారు. తమిళతల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయగీతం ఆలపించాలని సభాపతిని గవర్నర్ కోరగా అందుకు నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయగీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరినా ఉద్దేశపూర్వకంగానే నిరాకరించారని లోక్‌భవన్ వెల్లడించింది.
‘‘తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో జాతీయగీతాన్ని పాడకుండా అవమానించి.. ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించింది. గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైక్‌ను పదేపదే ఆపివేశారు. ఆయనను మాట్లాడడానికి అనుమతించలేదు. అసెంబ్లీలో తరచూ జాతీయగీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్ అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం గవర్నర్‌కు ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్య, నిరాధారమైన ప్రకటనలు ఉండడంతో దానిని చదవడానికి ఆయన నిరాకరించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతోన్న దారుణాలు, మహిళలపై లైంగిక హింస వంటి సమస్యలు తీవ్రమవుతుంటే వాటి గురించి ప్రసంగ కాపీలో ఎక్కడా ప్రస్తావించలేదు’’ అని లోక్‌భవన్ తన ప్రకటనలో పేర్కొంది.





