News

ఆలోచన అనేది ఓ శక్తి స్వరూపం : డా. మోహన్ భాగవత్

2views

న్యూఢిల్లీ : ఆలోచన అనేది ఓ శక్తి స్వరూపమని, ఆ శక్తికి సరైన దిశానిర్దేశం చేసినప్పుడు ప్రపంచానికి మేలు చేసేలా వినియోగించుకోవచ్చని ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. మనం ప్రపంచంలో అంతర్భాగమని, అందుకే తాము జీవించడంతో పాటు, ఇతరులను కూడా జీవించనివ్వాలన్న సూత్రంతో వుండాలన్నారు. తాము జీవించడం, ఇతరులు కూడా జీవించేలా చేయడమే విద్య యొక్క అసలైన ఉద్దేశమని వివరించారు.

ఈ నెల 16 న ఢిల్లీలోని IILM యూనివర్సిటీ మరియు బనియన్ ట్రీ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సంవాద కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. 10వ తరగతి నుండి పోస్ట్-గ్రాడ్యుయేట్ స్థాయి వరకు ఉన్న విద్యార్థులతో ముచ్చటించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

పాఠశాలలు, కళాశాలలు జ్ఞానాన్ని అందిస్తాయి, కానీ జ్ఞానానికి సరైన మార్గదర్శకత్వం అవసరమని నొక్కి చెప్పారు. పదే పదే శీలం గురించి మాట్లాడతామని, శీలం గల వ్యక్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు, వారు దానితో ఇతరులను శక్తివంతం చేస్తారు; వారు డబ్బును సంపాదించినా, దానిని ఇతరుల సంక్షేమం కోసం దానం చేసి, సామూహిక శ్రేయస్సు కోసం కృషి చేస్తారన్నారు. ఒకరు అధికారాన్ని పొందినప్పుడు, దానిని బలహీనులకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. కానీ నైతిక స్థైర్యం లేని వ్యక్తి ఏమి చేస్తాడు? వారు జ్ఞానాన్ని సంపాదించినట్లయితే, అసమ్మతిని వ్యాపింపజేసి, అల్పమైన విషయాల మీద గొడవలను రేకెత్తిస్తారని ఉదహరించారు.

ప్రపంచం వైవిధ్యభరితమైందని, జ్ఞానాన్ని ఆర్జించిన సద్గుణశీలమైన వ్యక్తి అందర్నీ ఏకం చేసే శక్తితో వుంటాడని, అదే సద్గుణశీలం లేని వ్యక్తి చిన్న చిన్న విషయాలనే వెతుక్కుంటూ ఘర్షణలకు తెరతీస్తాడని తెలిపారు. విద్య అనేది వ్యక్తిత్వ నిర్మాణం కోసం ఉద్దేశించిందని, అయితే జంతువుల స్వభావం పూర్తిగా భిన్నమైందని, తినడం, తాగడం, సంతానోత్పత్తి చేయడం, చివరికి మరణించడం ఇలాగే జీవిస్తాయన్నారు. వాటికి వేరే మార్గాలేవీ లేవన్నారు. అయితే మానవులకు మాత్రం దేనినైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వుంటుందని, మంచి వ్యక్తిగా, చెడ్డ వ్యక్తిగా మారేది కూడా మన చేతుల్లోనే వుంటుందన్నారు.

ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దో? విద్య మనకు నేర్పిస్తుందన్నారు. మన మన శ్రేయస్సును చూసుకుంటూనే, ఇతరులకు మేలు చేసేలా కూడా వ్యవహరించాలి, ఇతరులకు హాని కలిగించే పనులేవీ చేయవద్దని, ఒకు తమ జీవితాన్ని విజయవంతంగా, అర్థవంతంగా మలచుకోవడాన్నా చేయాల్సింది ఇదేనన్నారు. ‘‘ఏ విజయవంతమైన వ్యక్తి వ్యక్తిత్వాన్నైనా పరిశీలించండి; వారి జీవితానికి ఒక అర్థం ఉండటం వల్లే వారు విజయం సాధించగలిగారు, అంతేకాక ఆ విజయం అందరికీ మేలు చేకూర్చినప్పుడే అది నిజమైన విజయంగా నిలిచింది.’’ అని వివరించారు.

మన దేశం గొప్పగా ఉండాలని మనం ఆకాంక్షిస్తున్నాం. జీవితాన్ని ఎలా గడపాలో ప్రపంచం మొత్తానికి మన వ్యక్తిత్వం ద్వారా నేర్పడమే మన దేశం యొక్క అసలు ఉద్దేశమని మోహన్ భాగవత్ వివరించారు. భారత దేశ పాత్ర కూడా అదేనన్నారు. మనం అమెరికా తరహాలో ఒక అగ్రరాజ్యంగా (సూపర్ పవర్) గా మారమని, ఆర్థిక మరియు సైనిక బలం పరంగా మనం ఖచ్చితంగా అగ్రస్థానానికి చేరుకుంటాం, కానీ మనకు అది కేవలం ఒక మైలురాయి మాత్రమేనని స్పష్టం చేశారు. ఇదే భారత దేశ అంతిమ లక్ష్యం మాత్రం కాదని, ప్రపంచం మొత్తాన్ని ఒక మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

భారత్ ని సుస్థిరంగా వుంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మోహన్ భాగవత్ గుర్తు చేశారు. ఒక వ్యక్తి దేశం బలహీనంగా ఉంటే, వారి జ్ఞానానికి ఎలాంటి గౌరవం లభించదు మరియు వారికి కూడా భద్రత ఉండదన్నారు. మన వ్యక్తిగత ప్రతిష్ట మరియు భద్రత భారతదేశ ప్రతిష్ట మరియు భద్రతతో ముడిపడి ఉన్నాయని మోహన్ భాగవత్ తెలిపారు.