News

తిలకం పెట్టుకున్నందుకు.. లండన్‌ స్కూల్‌లో హిందూ విద్యార్థిపై వివక్ష

244views

యూకే రాజధాని లండన్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల విద్యార్థికి వివక్ష ఎదురైంది. తిలకం పెట్టుకున్న కారణంగా స్కూల్ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆ చిన్నారి పాఠశాల మారాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లోని హిందువులు, భారతీయులకు ప్రాతినిధ్యం వహించే ఇన్‌సైట్ యూకే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..

లండన్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదేళ్ల హిందూ విద్యార్థితన సంప్రదాయాలకు అనుగుణంగా తిలకం ధరించి పాఠశాలకు వెళ్లడంతో యాజమాన్యం అభ్యంతరం వ్యక్తంచేసింది. అతడి మతపరమైన ఆచారాల గురించి పాఠశాల సిబ్బంది ఆరా తీసేవారు. పిల్లలు ఆడుకునే సమయంలో హెడ్‌టీచర్ ఆ విద్యార్థిపై ప్రత్యేకంగా దృష్టిసారించేవారు. దాంతో భయపడిపోయిన ఆ విద్యార్థి ఇతరులతో ఆడుకోవడానికి ఇబ్బందిపడినట్లు యూకే సంస్థ వెల్లడించింది. ఏ విద్యార్థి తన మత విశ్వాసాల వల్ల ఒంటరితనాన్ని ఎదుర్కోవడం తగదని పేర్కొంది.

ఇలాంటి ఘటనలు విద్యార్థులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని, భద్రతాపరంగా ప్రశ్నలు లేవనెత్తుతాయని విమర్శించింది. విద్యార్థి తల్లిదండ్రులు తమ మత విశ్వాసాల గురించి పాఠశాల యాజమాన్యానికి వివరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందని తెలిపింది. దాంతో ఆ చిన్నారి స్కూల్ మారాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆరోపించింది. ఇది రుజువైతే అక్కడి చట్టాల ప్రకారం మత వివక్షగా పరిగణిస్తారు. ఈ వివక్షాపూరిత చర్యల కారణంగా ఇప్పటివరకు ఈ స్కూల్ నుంచి నలుగురు విద్యార్థులు వెళ్లిపోయినట్లు ఆగ్రహం వ్యక్తంచేసింది.