News

ఈ ఏడాది 12 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు

199views

సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనిపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం ప్రకటన చేశారు. తొలి రైలు కోల్‌కతా-గువాహటిల మధ్య అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ రైలు ఈ నెల 18 లేదా 19న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుందన్నారు. పశ్చిమబెంగాల్‌-అస్సాం మధ్య నడిచే ఈ రైల్లోని టికెట్‌ ధరలు.. విమాన టికెట్ల కంటే తక్కువే ఉంటాయన్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణానికి రూ.6 వేలు నుంచి రూ.8 వేలు ఖర్చవుతోందని వైష్ణవ్‌ తెలిపారు. వందేభారత్‌ స్లీపర్‌లో థర్డ్‌ ఏసీలో టికెట్‌ ధర (ఆహారంతో కలిపి) సుమారు రూ.2,300, సెకెండ్‌ ఏసీలో సుమారు రూ.3 వేలు, ఏసీ ప్రథమ శ్రేణిలో సుమారు రూ.3,600 ఉంటుందన్నారు. మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని టికెట్‌ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఆరు నెలల్లో మరో ఎనిమిది రైళ్లు సిద్ధమవుతాయని, ఈ ఏడాదిలో మొత్తం 12 రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 11 థర్డ్‌ ఏసీ, నాలుగు సెకెండ్‌ ఏసీ, ఒక ఫస్ట్‌ ఏసీ పెట్టెలుండే ఈ రైల్లో 823 మంది ప్రయాణించవచ్చు. గంటకు 180 కి.మీ. గరిష్ఠ వేగంతో వెళ్లేందుకు వీలుగా రైలును తయారుచేసినా ప్రస్తుతానికి దీనిని 120-130 కి.మీ. వేగంతో నడిపిస్తారు.