News

‘దేశంలో వైట్​ కాలర్ ఉగ్రవాదం పెరుగుతోంది’- రాజ్​నాథ్ సింగ్​ ఆందోళన

240views

దేశంలో ‘వైట్ కాలర్’ ఉగ్రవాదం పెరుగుతున్న ధోరణి ఆందోళన కలిగిస్తోందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. అత్యంత విద్యావంతులైన కొందరు సమాజానికి, దేశానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో భూపాల్ నోబుల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. గతేడాది నవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడును ప్రస్తావిస్తూ వైట్ కాలర్ ఉగ్రవాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. జ్ఞానంతో పాటు విలువలు, నైతికత ఎంత అవసరమో ఆ ఘటన తెలియజేస్తుందని చెప్పారు. రోగులకు ప్రిస్క్రిప్షన్‌పై ‘RX’ అని రాసే వైద్యుల చేతుల్లో ‘RDX’ ఉండటం దురదృష్టకరమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలోని డిఫెన్స్ స్టార్టప్‌లు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఆయుధాల తయారీలో భారత్ పూర్తి స్వయం సమృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

“వైట్-కాలర్ ఉగ్రవాదం అనే ఆందోళనకరమైన ధోరణి ఈ రోజు దేశంలో పెరుగుతోంది. అత్యంత విద్యావంతులైన వారిలో కొందరు సమాజానికి, దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మీరు చూశారు. దిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అది చేసింది ఎవరు ఓ వైద్యుడు. రోగులకు ప్రిస్క్రిప్షన్‌ పైన ఆర్‌ఎక్స్ రాసిన తర్వాత వైద్యులు మందులు రాస్తారు. ఐతే కొందరి వైద్యుల చేతుల్లో ఆర్‌డీఎక్స్ ఉంది. జ్ఞానంతో పాటు సంస్కారం కూడా ఉండాలి.”
– రాజ్​నాథ్ సింగ్​, రక్షణమంత్రి

నీతి, నైతికత ముఖ్యం
‘విద్య ఉద్దేశం కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదు, నైతికత, నీతి, మానవ వ్యక్తిత్వ వికాసం కూడా. నవంబర్​ 10న ఎర్రకోట వెలుపల బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. ఈ పేలుడుకు కారణమైన ఐ20 కారులను డాక్టర్ ఉమర్ ఉన్​ నబీ నడిపాడు. ఈ కేసు దర్యాప్తులోనే వైట్​-కాలర్ ఉగ్రవాద ముఠా గురించి తెలిసింది. దీని ఫలితంగా ముజమ్మిల్ గనాయ్​, అదీల్ రథర్​, షహీనా సయీద్​ అనే ముగ్గురు వైద్యులతోపాటు, మరికొందిరిని అరెస్టు చేశారు” అని రాజ్​నాథ్ తెలిపారు.

రక్షణ రంగ స్టార్టప్​లు
దేశంలో ప్రస్తుతం అనేక రక్షణ రంగ స్టార్టప్​లు అద్భుతంగా పనిచేస్తున్నాయని రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు. రానున్న 15-20 ఏళ్లలో ఆయుధాల విషయంలో భారత్ పూర్తిగా స్వావలంబన సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్​, ఇతర సాంకేతికతలు ప్రజల జీవితాలను, పనితీరుని మారుస్తున్నాయని అన్నారు. వీటిని భారతదేశ అభివృద్ధిని మరింత ముందుకు నడిపించడానికి సానుకూలంగా ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత్​ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని రాజ్​నాథ్ సింగ్ అన్నారు. ఈ ప్రయాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఆత్మగౌరవం, అహంకారం మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలని, వాటి మధ్య ఉన్న సన్నని గీతను ఎప్పుడూ దాటవద్దని ప్రజలను కోరారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ అహంకారంగా మారనీయవద్దని ఆయన అన్నారు.

మేవాఢ్​ రాజా ఘనత
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో భూపాల్ నోబుల్స్ విశ్వవిద్యాలయాన్ని 1923లో మేవాఢ్​ రాజా మహారాణా భూపాల్​ సింగ్​ జీ స్థాపించారు. నేటికి ఆ యూనివర్సిటీకి 104 వసంతాలు. ఈ సందర్భంగా రాజ్​నాథ్​ సింగ్ ఆయనకు నివాళులు అర్పించారు. మహారాణా భూపాల్​ సింగ్ ఒక గొప్ప పాలకుడు మాత్రమే కాదని, దూరదృష్టి కలిగిన విద్యావేత్త, నిబద్ధత కలిగిన దేశభక్తుడని కొనియాడారు. ‘భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాల విలీనం జరిగింది. ఆ సమయంలో మహారాణా భూపాల్ సింగ్​జీ తన సంస్థానాన్ని స్వచ్ఛందంగా భారత్​లో విలీనం చేశారు. ఆయన తన రాజ్యం గురించి, సంపద, ఐశ్వర్యం గురించి చింతించలేదు’ అని రాజ్​నాథ్ అన్నారు.

వాస్తవానికి మహారాణా భూపాల్ సింగ్​ 1930-48 వరకు మేవాఢ్​ (ఉదయ్​పుర్​) సంస్థానాన్ని పాలించారు. 1948 నుంచి 1955లో మరణించే వరకు ఆయన రాజస్థాన్​ మొదటి రాజప్రముఖ్​గా పనిచేశారు.