News

మేడారం జాతరలో.. ఆళ్లగడ్డ కళావైభవం

34views

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శిల్పుల కళా నైపుణ్యం చూపరులను అబ్బురపరుస్తోంది. కళకు జీవం పోసి.. శిలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతరలో వన దేవతలు కూర్చునే గద్దెల పునర్నిర్మాణ పనుల్లో ఆళ్లగడ్డ శిల్పులు నిమగ్నమయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే జాతర ఏర్పాట్లపై అక్కడ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.. తాత్కాలిక పనులకు స్వస్తి పలికి శాశ్వత నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట (వనం) నుంచి గద్దెలపైకి చేరుకుంటారు. గద్దెలు, ఆలయ నిర్మాణానికి కావాల్సిన రాళ్ల (100 టన్నుల శాండ్‌ స్టోన్‌, తెల్ల గ్రానైట్‌)ను వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. ఒక్కోటి వంద టన్నులకుపైగా ఉంటుంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చెక్కుతున్నారు. ఏకశిల శిల్పాన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మేడారం తరలించే పనిలో పడ్డారు.