
భారత చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిన నెల్లి మారణకాండకు సంబంధించి అస్సాం ప్రభుత్వానికి సమర్పించిన త్రిభువన్ ప్రసాద్ తివారీ కమిషన్ నివేదికను అసెంబ్లీలో నవంబర్ 25న హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ప్రవేశపెట్టడం నిజంగా సాహసోపేతమైన చర్యగా చెప్పుకోవాలి. తద్వారా దీనిపై జాతీయస్థాయిలో చర్చకు తెర లేపినట్లయింది.
ఫిబ్రవరి 18, 1983న జరిగిన ఈ హింసా కాండకు కారణాలు, పూర్వాపరాల పరిశీలన కోసం అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా నేతృత్వంలోని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తివారీ నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మే, 1984లో ఈ కమిషన్ తన నివేదికను సమర్పించగా, సంఘటన సున్నితత్వాన్ని సాకుగా చూపుతూ అప్పటినుంచి ప్రభుత్వాలు దీన్ని బహిర్గతం చేయలేదు. ఈ హత్యాకాండ అస్సాంలోని మొరైగాన్ (ప్రస్తుతం నాగోన్) జిల్లాలోని 14 గ్రామాల్లో చోటుచేసుకుంది. ఈ గ్రామాలు వరుసగా అలీసింఘా, ఖులాపత్తర్, బసుంధరి, బుగ్దుబాబీల్, బుగ్దుబా హాబీ, బోర్జోలా, బుటూనీ, దొంగాబోరి, ఇందుర్‌మారి, మాటి పర్బత్, మూలాదరి, మాటీ పర్బత్ నెం.8, సిల్‌భెటా, బోర్బురి, నెల్లి. అయితే ఈ దారుణం జరగడానికి పాలనాపరమైన నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తివారీ కమిషన్ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలను పట్టించుకోకపోవడం, ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం, పౌర, పోలీసు విభాగాల మధ్య సమన్వయ లోపం ఈ విషాదానికి దారితీసాయని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వం తగిన సమయంలో సరైన రీతిలో స్పందించినట్లయితే ఈ దారుణం జరిగి ఉండేది కాదని కూడా నివేదిక కుండబద్దలు కొట్టింది.
తక్షణ కారణం
బాంగ్లాదేశ్‌నుంచి వలసల కారణంగా తీవ్రంగా ప్రభావితమైనవారు లౌలాంగ్ (తెవా) గిరిజన తెగ ప్రజలు. విపరీతంగా పెరిగిన బాంగ్లా వలస దార్ల అధీనంలోకి వీరి భూములు వెళ్లిపోయాయి. ప్రశ్నించిన వారిపై దాడులు సర్వసాధారణంగా మారిపోయింది. లౌలాంగ్ గిరిజన కుటుంబానికి చెందిన నలుగురు యువతులను బాంగ్లా ముస్లింలు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారని, ఆరుగురు చిన్న పిల్లలను కూడా హతమార్చారన్న పుకార్లు చెలరేగడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచు కుంది. నెల్లి మారణకాండకు తక్షణ కారణం ఇది. తెవా తెగ పెద్దల నిర్ణయం మేరకు బొర్‌బరీ గ్రామం నుంచి వందల సంఖ్యలో ప్రజలు, చుట్టుపక్కల బాంగ్లా అక్రమవలసదారులు అధికంగా ఉన్న 14 గ్రామాలపై దాడులకు దిగారు.
మారణకాండ
బాంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారు లను తిప్పి పంపాలని కోరుతూ నిర్వహించిన అస్సాం ఆందోళన పరాకాష్ట దశలో ఉన్న సమయంలో ఈ సామూహిక మారణకాండ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ హింసాకాండలో 1800 నుంచి 2191 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ, ఈ సంఖ్య మరింత అధికమని అనధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో సిక్కుల ఊచకోత కూడా ఇదే స్థాయిలో జరిగిందని చెప్పాలి. అధికారిక గణాంకాల ప్రకారం 370 మంది పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ సంఘటనకు సంబంధించి 688 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా తగిన ఆధారాలు లేని కారణంగా 378 కేసులను మూసివేశారు. 1985లో కుదిరిన అస్సాం ఒప్పందం ప్రకారం ఛార్జ్‌షీటు దాఖలు చేసిన 310 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ సంఘటనపై విచారణ జరగలేదు, శిక్షలు పడలేదు.
మైనారిటీలుగా మారిన స్థానికులు
అస్సాంలో అక్రమ వలసల కారణంగా స్థానిక జనాభా మైనారిటీలుగా మారుతున్నారని, ఇక్కడి సంస్కృతి, సామాజిక స్థితిగతులు, ప్రజల గుర్తింపు, పూర్తిగా దెబ్బతింటున్న నేపథ్యంలో అస్సాం ఉద్యమం మొదలైంది. ముఖ్యంగా బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నవారి జనాభా విపరీతంగా పెరగడంతో, స్థానికులు రాజకీయంగా తమ గుర్తింపును, ప్రాబల్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యమం మొదలు కావడానికి ఒక కారణం ఉంది. 1978లో లోక్‌సభ సభ్యుడు హీరాలాల్ పట్వారీ మరణించడంతో మంగళ్‌డోయ్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరపాల్సి వచ్చింది. ఈ ఎన్నిక పక్రియ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగినట్టు గుర్తించారు. దీనిపై విచారణ జరుపగా అక్రమంగా వలస వచ్చిన వారి పేర్లను పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితాలో చేర్చడమే ఇందుకు కారణమని తేలింది. ఈ పాపం కాంగ్రెస్ నాయకులదేనని వేరే చెప్పాల్సిన అవసరంలేదు. ఈ విధంగా అక్రమంగా చేర్చిన మొత్తం పేర్లను తొలగించేవరకు ఎన్నికను వాయిదా వేయాలని అఖిల అస్సాం విద్యార్థి సంఘం (ఏఏఎస్‌యూ) డిమాండ్ చేయడమే కాదు ఉద్యమం మొదలు పెట్టింది. అఖిల అస్సాం విద్యార్థి సంఘం (ఏఏఎస్‌యూ), అస్సాం గణ సంగ్రామ పరిషత్ (ఏఏజీఎస్‌పీ) విద్యార్థి సంఘాల నేతృత్వంలో ఈ సామాజిక-రాజకీయ ఉద్యమం 1979లో మొదలై 1985 వరకు కొనసాగింది. వీరి ప్రధాన డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయి. 1951 తర్వాత వలస వచ్చిన వారిని గుర్తించి స్వదేశానికి పంపాలి. ఓటర్ల జాబితాలో ఇటువంటి వారి పేర్లను గుర్తించి తొలగించాలి. వీరిని తమ స్వదేశానికి అంటే బాంగ్లాదేశ్‌కు తిప్పి పంపాలి. ఉద్యమకారులను సంతృప్తిపరచడానికి 1971 తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఉద్యమకారులు కోరుతున్న 1951 సంవత్సరానికి, కేంద్రం నిర్ణయించిన 1971కి పొంతన లేకపోవడం గమనార్హం. ఎట్టకేలకు ఆగస్టు 15, 1985న నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం, ఏఏఎస్‌యు, ఏఏజీఎస్‌పీ విద్యార్థి సంఘాల మధ్య మధ్యేమార్గంలో ఒక ఒప్పందం కుదిరింది. ఇదే అస్సాం ఒప్పందంగా ప్రసిద్ధి పొందింది. దీని ప్రకారం జనవరి,1966 – మార్చి,1971 మధ్యకాలంలో వచ్చిన వారిని విదేశీయులుగా పరిగణిస్తారు. పదేళ్లపాటు వీరి పేర్లను ఓటర్ల జాబితానుంచి తొలగిస్తారు. ఈ కాలం తర్వాత వీరికి పౌరసత్వం, ఓటింగ్ హక్కులను తిరిగి కల్పిస్తారు. మార్చి, 1971 తర్వాత మనదేశంలోకి ప్రవేశించిన వారిని అక్రమ వలసదార్లుగా గుర్తించి వీరిని బాంగ్లాదేశ్‌కు పంపుతారు. అస్సాం ప్రజల భాష, సంస్కృతులను ప్రభుత్వం పరిరక్షిస్తుంది. ఆస్సామీ భాషాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
అక్రమ వలసలతో అవస్థలు
బాంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోవడం, ఈవిధంగా అక్రమంగా చొరబడిన వారు క్రమంగా భూములను కొనుగోళ్లు చేసి, రాజకీయంగా ప్రాబల్యాన్ని పెంచుకోవడం, ఉద్యోగావకాశాలను కొల్లగొట్టడం అప్పట్లో ఒక రివాజుగా మారిపోయింది. ఓట్ల రాజకీయం కోసం స్థానిక రాజకీయ నాయకులు వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించడం స్థానిక అస్సాం ప్రజలకు ఇబ్బందిగా మారింది. క్రమంగా తమ భాష, సంస్కృతి పూర్తిగా దెబ్బతింటాయన్న భయం వీరిలో పెరుగుతూ వచ్చి చివరకు విద్యార్థి ఉద్యమానికి దారితీసింది. ఒకపక్క ఈ ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగు తుండగానే, కేంద్రంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1983లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, ఏ అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్నదో, అటువంటి 40 లక్షల బాంగ్లా ముస్లింలకు ఓటు హక్కు కల్పించాలని తీసుకున్న వివాదాస్పద నిర్ణయం సమస్యను మరింత పెద్దది చేసింది. తమ ఉనికి కోసం పోరాడుతున్న స్థానికుల్లో ఈ నిర్ణయం ఆగ్రహావేశాలను కట్టలు తెంచుకునేలా చేసింది. లౌలాంగ్ తెగ ప్రజలతో పాటు స్థానిక అస్సామీ తెగల వారు (ముఖ్యంగా వలస ప్రజల దాష్టీకానికి గురైన తెగల ప్రజలు) ఎన్నికలను తిరస్కరించగా, సహజంగానే బాంగ్లా వలసదార్లు ఈ ఎన్నికలను సమర్థించడం గమనార్హం.
అఖిల అస్సాం విద్యార్థి సంఘం సహా ఇతర స్థానిక సంస్థలు ఈ ఎన్నికలు బహిష్కరించినప్పటికీ కేంద్రం మొండి పట్టుదలతో ఎన్నికలు నిర్వహణకే ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 63 నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే హింసాకాండ చెలరేగితే నియంత్రించడం కష్టం కనుక దశలవారీగా ఎన్నికలు జరపాలని అప్పటి రాష్ట్ర డీజీపీ కె.పి. గిల్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు వీటిల్లో 23 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. ఇటువంటి కల్లోలిత ప్రాంతాల్లో నెల్లీ కూడా ఉండటం గమనార్హం. దశలవారీగా నిర్వహించిన ఈ ఎన్నికలకు 400 కంపెనీలు సెంట్రల్ పారా మిలిటరీ దళాలను, 11 బ్రిగేడ్ల సైన్యాన్ని మోహరించారంటే, అస్సాంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తివారీ కమిషన్ ఏం చెప్పింది?
జులై 14, 1983న హితేశ్వర్ సైకియా నేతృత్వంలోని (కాంగ్రెస్) అస్సాం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి త్రిభువన్ ప్రసాద్ ఏర్పాటు చేసిన తివారీ కమిషన్ మే, 1984లో తన నివేదికను సమర్పించింది. హింసాకాండకు ప్రధాన కారణాలైన ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యంపై విచారణ జరిపి, భవిష్యత్తులో ఇటువంటివి చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసులు చేసింది. తన నివేదికలో ఈ క్రింది అంశాలను స్పష్టంగా వివరించింది.
నెల్లీ మారణకాండకు ముందు పరిస్థితి నివురు కప్పిన నిప్పులా ఉన్నదని, అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలు కావచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ద్వారా అధికారులకు ముందే తెలుసు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నా అధికారులు వాటిని ఎంతమాత్రం ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లా అధికార యంత్రాంగానికి, పోలీసులకు మధ్య ఏమాత్రం సమన్వయం లేదు. హింసాకాండ వేగంగా విస్తరిస్తున్నప్పుడు తక్షణం స్పందించాల్సిన అధికారులు తాపీగా వ్యవహరించడం ఘోరం. అల్లర్లు జరుగు తాయని భావించిన ప్రాంతాల్లో ముందస్తు అరెస్ట్‌లు, ఆయా ప్రాంతాను భద్రతాపరంగా నియంత్రణలోకి తెచ్చుకోవడం, ఆయా తెగల పెద్దలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపినట్లయితే ఇంతటి స్థాయి ఉద్రిక్తతను కొంతమేర నివారించడం సాధ్యమయ్యేది. ప్రమాదం అంచున ఉన్న జనాభాకు తగిన రక్షణ, సురక్షిత ప్రాంతాలకు తరలింపు వంటి చర్యలు చేపట్టినట్లయితే ఈ హింసాకాండ జరిగి ఉండేది కాదు అని నివేదిక పేర్కొంది.
రాజకీయ అస్త్రంగా మారుతుందా?
తివారీ కమిషన్ నివేదికను అస్సాం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ద్వారా, జవాబుదారీతనం, బాధితు లకు తగిన న్యాయం, మారణకాండ తర్వాత ఎటువంటి శిక్షలు పడకపోవడం వంటి అంశాలపై చర్చను తిరిగి ప్రారంభించినట్టయింది. ప్రజలకు ఈ మారణకాండ వెనుక అసలు నిజాలు వెల్లడవుతాయి. అయితే అస్సాంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ నివేదిక రాజకీయ అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదు. సంఘర్షణ, సంక్లిష్ట పరిస్థితు లను ముందుగానే గుర్తించి నివారణ, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను మరింత బలోపేతం చేయడా నికి చర్యలు తీసుకోవచ్చు. అస్సాం ఒప్పందంలో పేర్కొన్న అక్రమ వలసదార్ల గుర్తింపు, వారిని స్వదేశానికి తరలించడమన్న అంశం ఇప్పటివరకు అమలు కాలేదు. దీనిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎన్‌ఆర్‌సీ, సీఏఏలపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగు తున్న నేపథ్యంలో పౌరసత్వం, వలసలు, సామాజిక సంబంధాలపై ప్రభావం వంటి ఆంశాలపై వ్యక్తమవు తున్న ఆందోళనను తీవ్రంగా పరిగణించక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మారణకాండలో తన తప్పిదాన్ని మొట్టమొదటిసారి అంగీకరించడం ద్వారా అసలు వాస్తవాన్ని వెల్లడించినట్లవుతుంది.
గత ప్రభుత్వ చారిత్రక తప్పిదం నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం చారిత్రక అన్యాయాన్ని అంగీక రించడంతోపాటు, స్థానిక తెగల సామాజిక సంక్షేమం అనే అంశాలపై దృష్టి కేంద్రీకరించడానికి వీలవు తుంది. సమ్మిళితత్వం, గుర్తింపు రాజకీయాలను సమన్వయం చేసుకుంటూ పాలనను ముందుకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. గతాన్ని అంగీకరించడం సలుపుతున్న పాత గాయాలను మాన్చే ప్రయత్నమైనప్పటికీ, ఈ పారదర్శకత ధ్రువాత్మకతకు దారితీయకూడదు. వాస్తవం, సహానుభూతి, సుసంఘటితత్వాల మధ్య ఇదొక వారధిలా పనిచేయాలి. ప్రస్తుత ప్రభుత్వం స్థానిక జాతుల మధ్య నెలకొన్న సంక్లిష్ట సంబంధాల నేపథ్యంలో తన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి మరింత సమన్వయంతో ముందుకెళ్లాలి.





