
శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కోరారు. తిరుమలలోని సేవా సదన్ లో శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న ట్రైన్ ద ట్రైనర్స్ కార్యక్రమంలో ఆయన సేవకులతో స్వయంగా మాట్లాడి శిక్షణా కార్యక్రమంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
గ్రూప్ సూపర్వైజర్లకు ఇస్తున్న శిక్షణ చాలా గొప్ప కార్యక్రమమని సేవకులు ఈవోకు అభినందనలు తెలిపారు. పలువురు సేవకులు తమ సలహాలు, సూచనలు అందించారు. అనంతరం ఈవో సేవకులతో మాట్లాడుతూ 2000 నవంబర్ నెలలో 200 మంది సేవకులతో ప్రారంభమైన శ్రీవారి సేవ ప్రస్తుతం 17 లక్షల మందికి చేరుకోవడం చాలా గొప్ప విషయంగా అభివర్ణించారు.
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లకు ట్రైన్ ద ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తరగతి శిక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అధ్యయనం చేసిన అంశాలను గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులకు నేర్పించి వారిని ఉత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు.
త్వరలో టీటీడీ పరిధిలోని స్థానికాలయాలన్నింటిలో కూడా శ్రీవారి సేవను దశల వారీగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. శ్రీవారి సేవకులు తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా శ్రీవారి సేవ చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి. రవి, పీఆర్వో (ఎఫ్ఏసీ) కుమారి నీలిమ, ఐఐఎం అహ్మదాబాద్, ఏపీ ప్రణాళిక విభాగం నిపుణులు తదితరులు పాల్గొన్నారు.





