
భారీ తారాగణం, పెద్ద ప్రచార ఆర్భాటం లేకుండానే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన భారత యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ సినిమా… ప్రస్తుతం 98వ ఆస్కార్ అవార్డుల కోసం ‘ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతున్న 35 చిత్రాల ప్రాథమిక జాబితాలో ‘మహావతార్ నరసింహ’ చోటు దక్కించుకుంది. జనవరి 22న ప్రకటించే తుది నామినేషన్లలో ఈ చిత్రం ఎంపికైతే, ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ యానిమేషన్ చిత్రంగా చరిత్ర సృష్టిస్తుంది.
ఈ నేపథ్యంలో, ఇటీవల ఈ చిత్రాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ స్వామి నారాయణ దేవాలయంలో ప్రదర్శించడం విశేషం. ఈ ప్రదర్శనకు వందలాదిగా తరలివచ్చిన పాకిస్థానీ హిందువులు, వెండితెరపై నరసింహస్వామి కథను చూసి భావోద్వేగానికి గురయ్యారు. పురాణాల ప్రకారం, హిరణ్యకశ్యపుడి స్వస్థలం నేటి పాకిస్థాన్‌లోని ముల్తాన్ అని, నరసింహావతారం అక్కడే జరిగిందని స్థానిక పండితులు చెబుతుండటం ఈ సందర్భంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.





