News

పాక్ కుట్రను చేధించి 50 మంది ప్రాణాలను కాపాడిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌

38views

పాకిస్థాన్ కుయుక్తులను పసిగట్టి మన భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు దీటుగా బదులిస్తుంటాయి. అలాంటి ఒక కుట్రనే మన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌-CISF ఛేదించి.. 250 మంది ప్రాణాలను కాపాడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌తో గట్టి సమాధానం ఇచ్చింది. ఆ దెబ్బకు యద్ధం ఆపండంటూ పాకిస్థాన్ బతిమిలాడిన పరిస్థితి. అయితే మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత భారత సరిహద్దు సమీపంలో జమ్మూకశ్మీర్‌లోని ఉరి హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్ ప్రాజెక్టులపై దాడులు చేయాలని దాయాది దేశం ప్రయత్నించింది. సిందూర్ సమయంలో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులు సురక్షితంగా ఉంచడంలో, 250 మంది ప్రాణాలు కాపాడటంలో ధైర్యసాహసాలను ప్రదర్శించిన 19 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అభినందనలు దక్కాయి. వారికి తాజాగా ‘DGs disc’ను ప్రదానం చేయడంతో ఈ కుట్ర గురించి వెలుగులోకి వచ్చింది. పెండెంట్‌ ఆకృతిలో ఉన్న ఈ మెడల్‌ను సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌ అందిస్తుంటారు.

‘‘ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్రశిబిరాలపై భారత్‌ మెరుపుదాడులు చేసింది. దాంతో ఉలిక్కిపడిన పాక్.. భారత సరిహద్దు ప్రాంతాల వైపు విచక్షణారహితంగా షెల్లింగ్‌కు పాల్పడింది. దాంతో ఉరి ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి. సమీపప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నియంత్రణ రేఖకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఈ ఆకస్మిక షెల్లింగ్‌తో అప్రమత్తమయ్యారు. పాక్‌ దళాలను ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగారు. కమాండెంట్ రవి యాదవ్ నేతృత్వంలోని బృందం ప్రజలతో పాటు ప్రాజెక్టులను కాపాడేలా రక్షణ చర్యలు చేపట్టింది. పాక్‌ వైపు నుంచి వచ్చిన డ్రోన్లను కూల్చేసింది.

ఆ తుపాకీ గుండ్ల మధ్య ఇంటింటికీ భద్రతా సిబ్బంది తిరిగి స్థానికులను, ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్) సిబ్బంది కుటుంబాలను ఖాళీ చేయించారు. ఈ సంక్షోభ సమయంలో వారి సంసిద్ధతతో జాతీయ ఆస్తులు చెక్కుచెదరలేదు’’ అని సంబంధిత అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పాక్‌ను ఎదుర్కోవడంలో మన నిఘా నెట్‌వర్క్‌ సామర్థ్యం, దళాల అప్రమత్తత కీలక పాత్ర పోషించాయని ఆ అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1.8 లక్షల సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన కీలక ప్రాజెక్టులను పరిరక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. విమానాశ్రయాలు, అణు, అంతరిక్ష ప్రాజెక్టులు అందులో ఉంటాయి.

ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంకు దగ్గర్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటనలో ఓ కశ్మీరీ సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.