ArticlesNews

హిందూ ధర్మ రక్షణ కోసం గురు తేగ్ బహదూర్ ఆత్మబలిదానం

38views

( నవంబర్ 11 – గురు తేగ్ బహదూర్ బలిదాన దివస్ )

ప్రపంచంలోని అనేక ప్రాచీన మతాలు, సంస్కృతులు విదేశీ దండయాత్రల్లో తుడిచిపెట్టుకుపోయాయి. భారతదేశం మీద కూడా ఎన్నో దండయాత్రలు జరిగాయి. విదేశీ మతస్తులు మన ధర్మాన్ని నిర్మూలించేందుకు కుట్రలు, కుతంత్రాలు సాగించారు. హత్యలు, బెదిరింపులు, ఆలయాల ధ్వంసం, అత్యాచారాలు, ప్రలోభాలకు గురి చేసినా హైందవ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. ఎందరో యోధులు మన ధర్మ రక్షణ కోసం అమరులయ్యారు. ఈ కోవలోనిదే సిక్కుల గురుపరంపర. వీరిలో గురు తేగ్ బహదూర్ ఆత్మ బలిదానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నవంబర్ 11, 1675న ఆ మహనీయుని బలిదాన దినం.

మొఘలాయిల కాలంలో హిందువుల మీద దౌర్జన్యాలు పెరిగిపోయాయి. అదే సమయంలో హిందూత్వం అనైక్యతతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో సమాజాన్ని సంఘటితం చేసి మన ధర్మాన్ని, దేశాన్ని రక్షించేందుకు ముందుకొచ్చారు గురు గోవింద్ సింగ్, 1699లో బైసాఖీ రోజున ‘ఖల్సా పంథ్’ను ప్రారంభించారు. సిక్కు ధర్మంగా రూపుదిద్దుకున్న ఈ గురు పరంపరలో 6వ గురువు హరగోవింద్ సింగ్. ఆయన చిన్న కుమారుడే తేగ్ బహదూర్. అమృత్సర్లో ఏప్రిల్ 18, 1621న (వైశాఖ కృష్ణ పంచమి) జన్మించారు. తేగ్ బహదూర్ అంటే ‘కత్తిని పట్టుకునే అత్యుత్తమ వ్యక్తి’ అని అర్ధం. చిన్న వయసులోనే ఎక్కువగా ఏకాంతంలో ధ్యానంలో గడిపేవారు. విలువిద్య, కత్తిసాము, గుర్రపుస్వారీలతో పాటు గురుముఖి, హిందీ, సంస్కృతం భాషలపై పట్టుసాధించారు. తేగ్ బహదూర్ మొదటి నుంచి నిస్వార్థ సేవ, సత్యనిష్ట, త్యాగభావన, నిర్భయత్వం ఉండేవి. తన కుమారుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త అవుతారని తండ్రి హరగోవింద్ సింగ్ చెబుతుండేవారు.

తేగ్ బహదూర్ సింగ్ కు గురుపీఠం అంత తేలికగా దక్కలేదు. 8వ గురువు హరికిషన్ సింగ్ అవసాన దశలో ఉన్నప్పుడు తదుపరి గురువు అమృత్ సర్ లోనే ఉన్నారని చెప్పారు. అయితే ఈ పీఠంపై 22 మంది ఆశలు పెట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో మాఖన్ షా అనే వ్యాపారి నౌక తుపానులో చిక్కుకుంది. ఈ గండం నుంచి గట్టెక్కితే 500 బంగారు నాణేలను గురువుకు సమర్పిస్తానని మొక్కుకున్నారు. ఈయితే 22 మందిలో అసలు గురువును గుర్తించడం ఎలా అని ఆలోచిస్తే ఒక ఉపాయం తట్టింది. వీరందరికి తలా రెండు నాణేలు సమర్పించగా సంతోషంగా తీసుకున్నారు. ఆ తర్వాత తేగ్ బహదూర్ దగ్గరకు వెళ్లి 2 నాణేలు ఇచ్చాడు. ఆయన నవ్వుతూ నువ్వు మొక్కుకున్నది 500 బంగారు నాణేలు కదా అన్నాడు. మాఖన్షీ ఎంతో సంతోషించి 500 నాణేలు సమర్పించడంతో పాటు ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు. అందరి ఆమోదంతో 9వ గురువుగా పీఠాన్ని అధిష్టించారు.

మాయలు, అద్భుతాలకు వ్యతిరేకం
గురు తేగ్ బహదూర్ మొదటి గురువు చూపిన ధర్మ మార్గాన్ని ప్రచారం చేసేందుకు ఉత్తర భారతదేశమంతటా తిరిగారు. తేగ్ బహదూర్ మిగతా ఆధ్యాత్మికవేత్తల్లా అద్భుతాలు, మాయలు ప్రదర్శించేందుకు వ్యతిరేకం. ఆధ్యాత్మిక శక్తిని ఇందు కోసం దుర్వినియోగం చేయొద్దని చెబుతూ ఉండేవారు. ఆయన వ్యక్తిత్వం, సాధన, తపస్సు, త్యాగాలకు ప్రతీకగా నిలిస్తే.. కర్తృత్వం శారీరక, మానసిక శౌర్యానికి గుర్తుగా నిలచింది. సకారాత్మక అలోచనలు అదుపుచేయగలిగితేనే ధర్మ మార్గంలో పయనించగలుగుతారు. ఎలాంటి చింత, భయం లేకుండా ధర్మ మార్గంలో పయనించే సమాజాన్ని నిర్మించాలని గురు తేగ బహదూర్ భావించారు. ఆయన అటు తన కుటుంబం, ఇటు సమాజంలో సంస్కారాలను, విలువలను పెంపొందించారు. ధర్మం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేశారు. విపత్కర పరిస్థితిలో కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన చేసిన కార్యం వల్ల దేశ ప్రజానీకంలో ధైర్యం పెరిగింది. ఆయన ఇచ్చిన సందేశం భారతీయ సంస్కృతి, తత్త్వచింతన, ఆధ్యాత్మికతల మేలు కలయిక. సృజన, సమరసతల తోడుగా మానసిక వికారాలపై విజయం సాధించడం కోసం సాధన చేయాలని గురు తేగ్ బహదూర్ ఉపదేశించారు.

గురు తేగ్ బహదూర్ దగ్గరకు వచ్చిన ఓ స్త్రీ అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని స్పర్శతో సయం చేయాలని కోరింది. పిల్లవాడిని నాలుగు రోజుల తర్వాత తీసుకురమ్మని ఆయన చెప్పారు. నాలుగు రోజుల ఆ స్త్రీ తన కుమారుడిని తీసుకొచ్చినప్పుడు బెల్లం తిననివ్వొద్దని సూచించారు. తేగ్ బహదూర్ చెప్పిన ప్రకారమే ఆచరించగా అ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళ గురు దర్శనానికి వచ్చింది. బెల్లం తినవద్దని చెప్పడానికి నాలుగు రోజులు సమయం ఎందుకు తీసుకున్నారని అడిగింది. ఈ నాలుగు రోజులు తాను బెల్లం తినడం మానేసేందుకు సాధన చేశానని తెలిపారు. ఒకరికి చెప్పే ముందు నేను ఆచరించాలి కదా అని సమాధానం ఇచ్చారు. ఈ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు తేగ్ బహదూర్.

హిందువులపై చిత్రహింసలు
అవి మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు పాలిస్తున్న రోజులు, భారతదేశం మీద దండయాత్రకు వచ్చిన మహ్మద్ గజనీ కాలం నుంచి ప్రతీ ఇస్లాం పాలకుడూ హిందువుల శ్రద్ధా కేంద్రాలను ధ్వంసం చేసి సంపదను దోచుకుంటూ వచ్చారు. బాబర్ అయోధ్య రామజన్మభూమి మందిరాన్ని పడగొడితే, బెరంగజేబు కాశీలో విశ్వనాథ మందిరాన్ని, మధురలో శ్రీకృష్ణ జన్మభూమి మందిరాన్ని ధ్వంసం చేయించాడు. అక్కడ మసీదులు కట్టించాడు. హిందువుల పండుగల మీద నియంత్రణలు విధించి, తీర్ధయాత్రల మీద జిజియా పన్ను విధించాడు. హిందువులు మతం మారి ఇస్లాం స్వీకరించాలంటూ చిత్ర హింసలు పెట్టేవారు.

మొఘలాయిలను ఎదిరించే సామర్థ్యం కోల్పోయిన రాజపుత్రులు విధిలేని పరిస్థితుల్లో చక్రవర్తితో సంధి కుదుర్చుకున్నారు. తమ కుమార్తెలను సమర్పించుకొని సామంతులుగా మారిపోయారు. తమ స్వార్థం కోసం ప్రజల మొర అలకించి ధర్మరక్షణ చేసేందుకు ముందుకు రాలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందువులంతా గురు తేగ్ బహదూర్ తమను కాపాడతారని ఎంతో ఆశతో ఎదురు చూశారు.

భారత్ ను పూర్తి ఇస్లామీకరణ చేయాలని ఔరంగజేబు భావించాడు. హిందూ సమాజంలో పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులు ఎంతో కీలకం. వీరిని మతం మారిస్తే మిగతా వారిని లాగేయడం సులభం అని ఔరంగజేబు భావించారు. ఆయన దృష్టి కశ్మీర్ పండితుల మీద పడింది. మొగలాయిల అకృత్యాలు, అత్యాచారాలు భరించలేక వారు గురు తేగ్ బహదూర్ దగ్గరకు వచ్చారు. తమ గోడు చెప్పుకున్నారు. వారు చెప్పినది విన్న తరువాత ఆయన ఆలోచనలో పడ్డారు. కశ్మీరే కాకుండా దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. దీన్ని అడ్డుకోవాలంటే ఒక్కటే మార్గం. ఎవరో ఒక మహాపురుషుడు దేశం, ధర్మం కోసం ఆత్మబలిదానం చేయాలి. అలాంటి బలిదానం వల్ల కలిగే ప్రజా చైతన్యం వల్ల మొగలాయిలు భయపడతారు. కానీ అలా బలిదానం ఎవరు చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తేగ్ బహదూర్ పుత్రుడు గోవింద్ రాయ్ (తరువాత కాలంలో 10వ గురువుగా గురుగోవింద్ సింగ్ పేరుతో ప్రసిద్ధి) చెప్పారు. మీకంటే మహాపురుషుడు ఎవరున్నారు? అని తండ్రితో అన్నారు. కొడుకు ధైర్యాన్ని మొచ్చుకొని దీన్ని ఒక కర్తవ్యంగా తీసుకున్నారు.

ఆత్మబలిదానానికి సిద్ధం
గురు తేగ్ బహదూర్ కశ్మీరీ పండితులను పిలిచారు. ‘తేగ్ బహదూర్ మతం మారితే మేమూ మారేందుకు సిద్ధమని ఔరంగజేబుతో చెప్పండి’ అని వారికి సూచించారు. తేగ్ బహదూర్ ఔరంగజేబుకు లొంగరని వారికి తెలుసు. అందుకే వారు సంతోషంగా ఈ విషయాన్ని ఔరంగజేబుకు చేరవేశారు. సందేశం అందుకున్న మొఘలాయి చక్రవర్తి తేగ్ బహదూర్ను తీసుకురమ్మని ఇద్దరు సర్దారులను పంపాడు. తేగ్ బహదూర్ వారితో ఢిల్లీకి బయలు దేరారు. ఆయన వెంట ఐదుగురు శిష్యులు భాయి మతిదాస్, థాయి గురుదిత్త, భాయి ఊదా. భాయి చీమా, భాయి దియాలా కూడా బయలు దేరారు. మార్గమధ్యలో తనను కలిసిన ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. ఆగ్రా సమీపానికి రాగానే మొఘలాయి సైనికులు గురు తేగ్ బహదూర్న బోనులో బంధించారు. ఢిల్లీ తీసుకెళ్లి ఔరంగజేబు ముందు ప్రవేశపెట్టారు.

ఔరంగజేబు తన ముందు అద్భుతాలను ప్రదర్శించాలని గురు తేగ్ బహదూర్ ను ఆదేశించారు. అద్భుతాల కారణంగా అహంకారం పెరుగుతుందని, భగవంతుడు ఇచ్చిన శక్తిని వృథా చేయొద్దని ఆయన సమాధానం ఇచ్చారు. ఇస్లాంకన్నా గొప్పమతం మరొకటి లేదని, దాన్ని స్వీకరించాలని ఔరంగజేబు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇస్లాంలోకి వస్తే మతగురువును చేస్తామని, భోగభాగ్యాలకు లోటు ఉండదని ఆశపెట్టారు. ఆయన మాటలను తేగి బహదూర్ ఏ మాత్రం పట్టించుకోలేదు. మతం మారకుంటే చిత్రహింసలు పెట్టి వధిస్తానని బెదిరించారు. ఎంత బలవంతం చేసినా తాను మారే ప్రసక్తి లేదని తేగ్ బహదూర్ ఔరంగజేబుకు తేల్చి చెప్పారు. ఆగ్రహించిన మొఘలాయి చక్రవర్తి తన క్రూరత్వాన్ని చూపించాడు. సైనికులు ఒక శిష్యుడైన భాయి మతిదాసు రంపంతో నిలువునా చీల్చారు.
శిష్యుడు భాయి దియాలాను సలసల కాగే నూనెలో వేశారు. మరో శిష్యుడ్ని పత్తిలో మూటకట్టి దానికి నిప్పు పెట్టారు. ఈ క్రూర, అమానుష చర్యలు చూసి గురు తేగ్ బహదూర్ భయపడతారని వాళ్లు అనుకున్నారు. అన్యాయం, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడటమే ధర్మమని గురు తేగ్ బహదూర్ భావించారు. అందుకే ఆయన చలించలేదు. బోనులో ఉన్న ఆయన బుద్ధి, మనస్సు, ఆత్మ బందీ కాకుండా నిశ్చయంతో ఉన్నారు.

తన ఒత్తిడి ఏమాత్రం ఫలించకపోవడంతో బెరంగజేబులో క్రూరత్వం మరింత విజృంభించింది.. తేగ్ బహదూర్ శిరస్సు ఖండించాలని సైనికులను ఆదేశించారు. అశాశ్వతమైన దేహాన్ని వదిలేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన జపం పూర్తికాగానే చేయాల్సిన పని చేసుకోమని ధీమాగా తలారీకి చెప్పారు. జపం పూర్తి కాగానే తేగ్ బహదూర్ తల తెగిపోయింది. నవంబర్ 11, 1675న ఢిల్లీలోని చాందినీ చౌక్లో గురు తేగ్ బహదూర్ బలిదాన మయ్యారు. గురువు అమరుడైపోయినా తేగ్ బహదూర్ శిష్యులు ధైర్యం కోల్పోలేదు. ఆయన తలను ఆనందపూర్ తీసుకెళ్లారు. మిగతా శరీరాన్ని ఓ శిష్యుడు మొఘలాయిల కంట పడకుండా తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికే నిప్పు పెట్టి అంతిమ సంస్కారం నిర్వహించారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు రకాబ్ గంజ్ గురుద్వారా నిర్మించారు. తేగ్ బహదూర్ ఆత్మబలిదానం తర్వాత దేశమంతటా ఒక చైతన్యం వచ్చింది. ప్రతీకారం కోసం జాట్ వీరులు సిద్ధమయ్యారు. పదవ గురువుగా తేగ్ బహదూర్ పుత్రుడు గురు గోవింద్ సింగ్ పీఠాన్ని అధిష్టించారు.

ధర్మ రక్షణ కోసం గురు తేగ్ బహదూర్ ఆత్మ బలిదానం అపురూపమైనది. ఆయన మనకు శౌర్యం, త్యాగం, సంయమనాలను బోధించారు. అధర్మాన్ని ఎదిరించడం, నైతిక విలువల పట్ల నిష్ట, మానవతను మనకు చూపించారు. ఈ మార్గాన్ని అనుసరించడమే గురు తేగ్ బహదూర్ కు మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలీ.