News

45 ఏళ్ల శ్రమతో.. జానపద వాయిద్యాల సేకరణ

42views

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన ప్రముఖ జానపద కళాకారుడు రిఖి క్షత్రియ గత 45 ఏళ్లుగా శ్రమిస్తూ 211 అరుదైన జానపద సంప్రదాయ వాయిద్యాలను సేకరించారు. భిలాయ్‌ స్టీల్‌ ప్లాంటు రిటైర్డ్‌ ఉద్యోగి అయిన ఈయన వాయిద్యాలను భద్రపరచడానికి ఓ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన 41 మంది విశిష్ట వ్యక్తులను ఇటీవల సత్కరించారు. జానపద కళలకు రిఖి క్షత్రియ చేసిన కృషికిగాను ఈ వేడుకల్లో ‘దావూ దులార్‌ సింగ్‌ మాంద్రాజీ’ అవార్డును ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా అందుకొన్నారు. భావితరాలు మన జానపద వారసత్వం సజీవంగా ఉండేలా చూసుకోవాలన్న లక్ష్యంతో వాటిని సేకరించినట్లు రిఖి క్షత్రియ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో తిరిగి అరుదైన ఈ జానపద వాయిద్యాలను సేకరించిన రిఖి, ఆయన భార్య అన్నపూర్ణ ‘ఛత్తీస్‌గఢ్‌ జానపద వాయిద్యాలు’ అనే పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు.