
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ 2 రోజుల ఉపన్యాసశ్రేణికి సంబంధించి శనివారం బెంగళూరులో ప్రారంభించిన తొలి రోజు ప్రసంగం 2వ భాగంలో ఆయన హిందూ సమాజ జీవన లక్ష్యాన్ని, సంఘ్ భవిష్య కార్యాచరణతో ముడిపడిన విస్తృత ప్రయోజనాలను వివరించారు. ప్రతి జాతికీ అది సాధించవలసిన ఒక ఆదర్శ కార్యక్రమం ఉంటుందన్ని స్వామి వివేకానందుల ప్రకటనను అనుసరించి, భారతీయుల లక్ష్యం ప్రపంచానికి ధర్మాన్ని అందించడమేనని చెప్పారు. ధర్మాన్ని, మతాన్ని ఒకే అర్థంలో చూడటం సరికాదంటూ మతం అనేది దైవాన్ని చేరే క్రమంలో ‘చేయవలసిన’, ‘చేయకూడని’ నిబంధనలతో కూడిన బంధమని పేర్కొన్నారు. అయితే, ధర్మానికి మరింత విస్తృతి ఉందని తెలియజేస్తూ ఇది సహజ స్వభావంగా, విధిగా, సమన్వయం, క్రమశిక్షణతో జీవన సిద్ధాంతంగా ఉంటుందన్నారు. “మండటం అనేది నిప్పుకు గల ధర్మం, అలాగే సృష్టిని ధర్మం నిలబెడుతుంది. అతి తీవ్రతలను తప్పించేలా దీనికి మధ్యేమార్గమూ ఉన్నది” అని విశదీకరించారు.
మానవులు భౌతిక వృద్ధిని సాధించినప్పటికీ నిజమైన సంతోషాన్ని పొందలేదని డాక్టర్ మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. “మానవ ప్రయత్నమనేది సంతోషాన్ని కాంక్షిస్తుంది. అయితే, జీవన గమనం మరింత సులభం అయినప్పటికీ తృప్తి లేకుండా పోయింది. మనం శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేసినప్పటికీ సంఘర్షణలు, అశాంతి కొనసాగుతూనే ఉన్నాయి. మనకు శరీరం, మనస్సు, మేధస్సుకు సంబంధించిన జ్ఞానం ఉన్నప్పటికీ ఈ మూడింటినీ అనుసంధానించేది ఏమిటనేది తెలియదు” అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తివాదం పెరిగిపోతున్న నేటి పరిస్థితుల్లో సామాజిక విచ్ఛిన్నం, పర్యావరణ పరిస్థితుల క్షిణత, వ్యక్తికి ప్రకృతితోను, తోటివారితోను, చివరికి తనతో సైతం బంధాన్ని కోల్పోవడం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. “సమాజాలు ఒక్కటై ఉన్నప్పుడు వ్యక్తి స్వేచ్ఛ అణచివేతకు గురవుతోంది. వ్యక్తులు ఎదుగుతున్నప్పుడు సమాజం విచ్ఛిన్నం అవుతోంది, ప్రకృతికి విఘాతం కలుగుతోంది. అయితే, వీటి మధ్య అనుసంధానం చేసే మూలసూత్రం లేదు, అదే ధర్మం” అని వివరించారు.
ప్రాచీన భారతీయ రుషులు తపస్సు ద్వారా సత్యమనేది బయట గాక తమలోనే ఉన్నదని గ్రహించి, తమలో ఉన్న ఆత్మయే జీవులందరిలోనూ ఉన్నదనే ఏకత్వాన్ని గుర్తించారని, ఈ సత్యం తెలియడంతో తృప్తి లభించిందని డాక్టర్ మోహన్ భాగవత్ భారతీయ సంస్కృతి మూలాన్ని స్పృశించారు. “ఈ రీతిలో ఏకత్వాన్ని గుర్తెరగడం అనేది శరీరాన్ని, మనస్సును, మేధస్సును అనుసంధానించి, తద్వారా వ్యక్తిని, సమాజాన్ని, ప్రకృతిని కలుపుతుంది. ఈ విధమైన సమన్వయమే పరమ సత్యపు అభివ్యకీకరణలన్నింటినీ ఏకం చేసే శాశ్వత మూలసూత్రమే ధర్మం” అని వివరించారు. ఇందుకు ఉదాహరణగా పావురాన్ని రక్షించేందుకు తన శరీరం నుంచి మాంసాన్ని త్యాగం చేసి విధి నిర్వహణలో ధర్మాన్ని సమన్వయం చేసుకున్న శిబి చక్రవర్తి కథను డాక్టర్ భాగవత్ ఉదహరించారు. “సృష్టిలో అత్యున్నత స్థాయిలో నిలిచిన మానవులు ప్రకృతి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ధర్మాన్ని ఆచరించాలి, ఇది ఉపన్యాసించేది కాదు” అని స్పష్టం చేశారు.
ఈ దృష్టికోణాన్ని ఆర్ఎస్ఎస్ కార్య శతాబ్దికి డాక్టర్ మోహన్ భాగవత్ అనుసంధానం చేస్తూ.. “హిందువుల జీవన లక్ష్యపు వికాస పరిణామమే ఆర్ఎస్ఎస్. దీని మొదటి దశ సమాజాన్ని సిద్ధం చేయడం, ఈ లక్ష్యం ఇంకా అసంపూర్తిగానే ఉంది” అన్నారు. హిందూ సంఘటనం దిశగా సంఘ కార్యాన్ని భారతదేశంలోని ప్రతి గ్రామం, సమాజంలోని ప్రతి స్థాయికి చేర్చేందుకు ప్రణాళికలున్నాయన్నారు.
Rss Chief Mohan Bhagwat BLR
సమాజంలో తమను తాము హిందువుగా గుర్తించని సమూహాలతో సంఘ్ ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించిందని డాక్టర్ భాగవత్ చెప్పారు. “వారి పూర్వీకులు హిందువులే.. మేం చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరించనప్పటికీ సమాజ హితం కోసం పనిచేస్తున్న సజ్జనశక్తి, శ్రేయోభిలాషులతో మేం కలసి పనిచేస్తాం” అని తెలిపారు. ధార్మిక భారతదేశాన్ని నిర్మించుకోవాలంటే సమష్టి యోజన ఉండాలంటూ.. “మన కలల భారతాన్ని సాకారం చేసుకోవాలంటే ముందుగా ఆలోచనలు, చర్చలతో ప్రారంభించాలి” అన్నారు. ఈ దిశగా భారతీయ జ్ఞాన వ్యవస్థ (Indian Knowledge system – IKS)ను పునరుద్ధరించాల్సి ఉందని పేర్కొంటూ ప్రస్తుతం కొనసాగుతున్న పలు ప్రాజెక్ట్‌లు భారతీయ శాస్త్ర విజ్ఞానంతో సమగ్రంగా ఇమిడి విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. ఇందులో వర్షపాతాన్ని అంచనా వేసే సంప్రదాయ విధానాలు కూడా ఉన్నాయన్నారు.
సంఘ్ ఆచరిస్తున్న సద్భావనా కార్యకలాపాలను తెలియజేస్తూ, సమాజంలో కొనసాగుతున్న మూఢాచారాలు, అంటరానితనాన్ని నిర్మూలనకు, సమాజంలో సహకారం, పరస్పర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు బ్లాక్ స్థాయి నుంచి పని జరుగుతోందన్నారు. ఈ మూడు అంశాలపైనా కుల పెద్దలు, సమాజంలోని నేతలు కలసి పనిచేస్తూ బ్లాక్ స్థాయిలోని అవసరాలను ఉమ్మడిగా తీర్చుతూ బలహీనవర్గాలకు తోడునిస్తే ఎవరైనప్పటికీ విభజన బీజాలను నాటే ప్రశ్నే ఉండదన్నారు.
దేశంలో వలస పాలన వల్లనే సమాజంలో విభజన ఇంకా లోతుకు వెళ్ళిందన్న ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్, ఆ పరిస్థితులను వివరించారు. “ఔరంగజేబ్ క్రూర పరిపాలన హిందూ – ముస్లింలను ఏకం చేసింది. తమ పరిపాలనను సుస్థిరం చేసుకోవడానికి బ్రిటిష్ వారు సమాజంలో విభేదాలు సృష్టించారు. నేడు స్వాతంత్ర్యం పొందినప్పటికీ, నాటి ఆలోచనా క్రమం ఇప్పటికీ నిలిచి ఉంది” అన్నారు. ఆరాధనా పద్ధతులు వేరైనప్పటికీ దేశం, జాతి, సంస్కృతి, సమాజ సంబంధంగా మనందరం ఒక్కటేనని తేల్చి చెప్పారు. జాతి జీవనంలో ధార్మిక విలువలను పాటించాలన్న డాక్టర్ భాగవత్, ఈ దిశగా పనిచేస్తున్నవారి నుంచి నేర్చుకోవాలన్నారు. ఇందుకుగాను సేవా సంగమాలను ఉదహరించారు. ముఖ్యంగా “మనస్సాక్షి లేని ఆనందం, పని చేయకుండా వచ్చే సంపద, వ్యక్తిత్వం లేని జ్ఞానం, నైతికత లేని వ్యాపారం, మానవత్వం లేని శాస్త్రం, త్యాగం లేని ఆరాధన, విలువలు లేని రాజకీయాలు” అనే ఏడు ఘోరమైన తప్పులను అధిగమించాలని స్పష్టం చేశారు. ఇందుకు గాను నైతిక విలువలు ఆచరణ, కరుణతో నిండిన భారతీయ జీవనశైలిని నిర్మించుకోవాలని, ఇదే ప్రపంచానికి సైతం ఆదర్శం అవుతుందని వివరించారు.





