రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ళ సుదీర్ఘ ప్రయాణం, సంస్థ దృష్టికోణం, దేశనిర్మాణం పట్ల గల నిబద్ధత తదితర అంశాలను స్పృశిస్తూ మేధావులు, విద్యావేత్తలు, సమాజ ప్రముఖులను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. “100 ఏళ్ళ సంఘ్ యాత్ర: కొత్త ఆశయాలు” (100 Years of Sangh Journey: New Horisons) అంశంపై వ్యాఖ్యానమాల పేరిట బెంగళూరులో 2 రోజుల ఉపన్యాస శ్రేణిని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.తొలి రోజున రెండు భాగాలుగా జరిగిన ఉపన్యాసంలోని మొదటి అంకంలో సంఘ్ వ్యవస్థాపక ఆదర్శాలు, వ్యవస్థాపకులైన డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవితము, లక్ష్యాలను, హిందూ విలక్షణత నిర్వచనం, నాగరిక సంబంధంగా భారతీయ ఐక్యత తదితర అంశాలను ప్రస్తావించారు.
సంఘ్ నిజతత్వం, ధ్యేయాలను తెలియజేస్తూ డాక్టర్ మోహన్ భాగవత్ తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోని మరే ఇతర సంస్థలతో పోల్చినా ఆర్ఎస్ఎస్ ఒక విభిన్నమైన సంస్థ అని తెలిపారు. ఏదో ఒక నిర్దిష్టమైన పరిస్థితి లేదా సంఘటనకు ప్రతిస్పందనగా లేక ఎవరి పట్ల అయినా వ్యతిరేకతతోను ఈ సంస్థ ఏర్పాటు కాలేదని స్పష్టం చేశారు. సంఘ్ లక్ష్యం యావత్ సమాజాన్నీ సమైక్య పరచడమేనన్నారు. వ్యక్తి నిర్మాణము తద్వారా సమష్టిగా సమాజ నిర్వహణ చేసుకోవడమన్నది సంఘ్ విధానంగా వివరించారు. భారతమాతకు నిస్వార్థంగా సేవలందించే దిశగా వ్యక్తులను వ్యక్తిత్వం, క్రమశిక్షణ, అంకితభావం కలవారిగా తీర్చిదిద్దడమే ‘మా పని’ అని విశదీకరించారు.
విధ్వంసము, ఘర్షణ పద్ధతులు ఏనాడూ సంఘ్ లక్ష్యం కాదని, ఎల్లప్పుడూ నిర్మాణం దిశగానే సంస్థ ఉన్నదని భాగవత్ తేల్చి చెప్పారు. సంఘ శాఖలలో సైతం వ్యక్తిగత ప్రయోజనాలు గాక, భారతమాత సేవయే లక్ష్యంగా వ్యక్తులకు శిక్షణ ఉంటుందని, హిందూ సమాజ సంఘటనమ తమ ఏకైక లక్ష్యమని అన్నారు. సంఘ ప్రార్థన సైతం ఇదే స్ఫూర్తిని వ్యక్తం చేస్తున్నదని తెలియజేస్తూ ప్రార్థన భారతమాతతో మొదలై, భారతమాతకు జయకారంతో ముగుస్తుందని, ఇదే తమ అంకితభావ సారమని అన్నారు.
సంఘ లక్ష్యం ఏనాడూ అధికారం లేదా రాజకీయ నియంత్రణ కానే కావని, భారతమాత వైభవం కోసం హిందూ సమాజ సంఘటనే తాము చేస్తామని డాక్టర్ మోహన్ భాగవత్ వెల్లడించారు. ఆర్ధిక వ్యవహారాల విషయంలో సంఘ్ ఎప్పుడూ సాధికారతతోనే ఉన్నదని, సంఘ్ నిర్వహణ కోసం ఏనాడూ బయటి నుంచి ఒక్క పైసా కూడా స్వీకరించలేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఎదుర్కొన్నన్ని విచారణలు, నిషేధాలు ప్రపంచంలో మరే సంస్థకూ ఎదురుకాలేదన్నారు. సంఘ్ మూడు నిషేధాలను అధిగమించి దృఢంగా, అవిచ్ఛిన్నంగా నిలిచి ఉందని వివరించారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్ స్వాతంత్య్రోద్యమ కాలంలో అనుశీలన్ సమితి అనే విప్లవ సంస్థతో పని చేశారని, కృతనిశ్చయంతో తమ యావత్ జీవితాన్ని భారతమాతకే అంకితం చేశారని భాగవత్ తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం, ఆ పాలకుల న్యాయస్థానాలు అక్రమమని, భారతదేశాన్ని పాలించే హక్కు ఏ విధంగానూ వారికి లేదని డాక్టర్ జీ బలంగా నమ్మి ఎదురించారన్నారు. వందేమాతర ఉద్యమానికి దారితీసిన రాజకీయ ధైర్యం తమకున్నదంటూ… యువకుల్లో దేశభక్తిని రగిలించేందుకు నాగ్‌పూర్ పాఠశాలల్లో ఈ ఉద్యమాన్ని డాక్టర్ హెడ్గేవార్ నిర్వహించారని గుర్తు చేశారు.
భారత్‌గా మనమెవరం?.. అని ప్రశ్నిస్తూ ఒక జాతిగా, ప్రజలు తమ ఉనికినే మర్చిపోయారన్న ఆర్ఎస్ఎస్ అధినేత, భారతీయులుగా మనని మనం మరచిపోయి ఆత్మవిస్మృతిలో పడ్డామని వ్యాఖ్యానించారు. మన స్వంత ప్రజలను, వైవిధ్యాన్ని మరచిన ఫలితంగా విభేదాలతో విభజన రేఖలు చోటు చేసుకున్నాయని ఆవేదన చెందారు. ప్రజలు మూలాలను మరచిన కారణంగా స్వామి వివేకానందులు, స్వామి దయానంద సరస్వతి నొక్కి చెప్పిన సంఘ సంస్కరణ విఫలమైందన్నారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ హిందూ దేశ/జాతి జీవన ధ్యేయ వికాస రూపమే ఆర్ఎస్ఎస్ అన్న దాదారావు పరమార్థ జీ మాటలను గుర్తు చేశారు.
చరిత్రలో భారతదేశం పలుమార్లు దాడులకు గురైందని డాక్టర్ మోహన్ భాగవత్ వివరిస్తూ యుద్ధం ద్వారా స్వాతంత్య్రం కోసం జరిగిన చివరి ప్రయత్నమే 1857 నాటి సంగ్రామమని అన్నారు. ఇందుకోసం దేశమంతా ఏకమైనా ఓటమి ఎదురైందని, ఆ తర్వాత ఎందుకు విఫలమయ్యామనే ప్రశ్నను సమాజం వేసుకుందని తెలిపారు. బ్రిటిష్ వారికంటే ముందే శకులు, హూణులు, యవనులు, ఆ తర్వాత చాలా కాలానికి ఇస్లామిక్ దాడులు జరిగాయని చరిత్రను ముందుంచారు. బ్రిటిష్ వారి రాకకు ముందు భారతదేశంలో ఒకే నాగిరికత ఉందని, భారత్ కోసం పోరాడినవారందరూ భారతీయులేనని స్పష్టం చేశారు.
హిందు.. అంటే మాతం మాత్రమే గాక నాగరిక / సాంస్కృతిక వారసత్వము, బాధ్యత అని విశదీకరిస్తూ, మొత్తం ముస్లింలు, క్రైస్తవులకు సైతం పూర్వీకులు ఒకరేనని డాక్టర్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఆ విధంగా వారూ హిందువులేనన్నారు. హిందువులంటే భారతమాత సంతతి అని, భారత్ పట్ల బాధ్యత గలవారు అని అన్నారు. ప్రస్తుతం నాలుగు రకాల హిందువులున్నారని తెలిపారు. హిందువులని గర్వించేవారు, హిందువులే అయినా ఆ ఆత్మగౌరవాన్ని అనుభవించనివారు, వ్యక్తిగతంగా హిందువులమని ఒప్పుకున్నా… భయంతోనో, ప్రయోజనాల కోసమో నలుగురిలో చెప్పుకోనివారు, అసలు తాము హిందువులమని మరచిపోయినవారు… ఇలా ఉన్నారని వివరించారు.
మొదటి రోజు తొలి భాగం ప్రసంగాన్ని డాక్టర్ భాగవత్ ముగిస్తూ మరచిన ఉనికిని, ఐక్యతను మేలుకొలపడమే సంఘ్ లక్ష్యమన్నారు.





