News

నేవీ స్థావరాల రహస్యాలు పాకిస్థాన్ కు చేరవేతలో మరో ఇద్దరికి జైలు శిక్ష

37views

మన దేశ రహస్యాలను పాకిస్థాన్ కు చేరవేశారన్న కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల పది నెలల కారాగార శిక్షతో పాటు చెరో రూ.ఐదు వేల జరిమానా చెల్లించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో నిందితులు మరో ఏడాది అదనంగా జైలుశిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు దొరికిన నిందితులలో ఆరుగురికి శిక్ష పడినట్లయింది. ఎన్ఐఏ అధికారులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

2019 డిసెంబరులో విశాఖలోని నేవీ స్థావరాలకు చెందిన రహస్యాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్నట్లు సమాచారం అందటంతో ఎన్ఐఏ 14 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. విశాఖకు చెందిన కలవలపల్లి కొండబాబు, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన అవినాశ్ సోమల్ నేవీ రహస్యాలను వాట్సప్, ఫేస్బుక్ ద్వారా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలకు అందించినట్లు గుర్తించింది. వీరిపై ఆరోపణలు రుజువు కావటంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. ఇదే కేసులో గతంలో అబ్దుల్ రెహమాన్, హరూన్ లక్షావాలా, షైస్టా ఖైసర్, ఇమ్రాన్ గితేలీలకు జైలు శిక్ష పడింది