
72views
ప్రపంచంలో ఆర్థికపరంగా వచ్చే హెచ్చుతగ్గులు భారత ఆర్థిక వ్యవస్థపై పరిమిత ప్రభావాన్నే చూపుతాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కొన్ని సార్లు సుంకాలు వంటి ఊహించని సవాళ్లు ఆర్థిక వ్యవస్ధను కాపాడుతున్నాయని, అదే దాని బలమని అన్నారు. బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (BIEC)లో లఘు ఉద్యోగ్ భారతి కర్ణాటక, IMS ఫౌండేషన్ సహకారంతో 7వ ఎడిషన్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ షో – IMS2025 ని మోహన్ భాగవత్ సందర్శించారు.
గత 5-10 సంవత్సరాలుగా, MSME రంగం క్రమంగా అభివృద్ధి చెందుతోందని, అలాగే ప్రపంచ రంగంలో క్రమంగా పోటీగా కూడా మారుతోందన్నారు. ఆత్మ నిర్భర భారత్ అన్న దార్శనికతను క్షేత్ర స్థాయిలో నిజంగా సాకారం చేసుకోవడానికి సూక్ష్మ,చిన్న మధ్యతరహార పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమలులో వున్న ఆర్థిక వ్యవస్థ సహజంగానే సంపద, ఉత్పత్తి కేంద్రీకరణకు దారితీస్తుందని, అదే నమూనాను మనం అనుసరిస్తే ఉపాధి అవకాశాలు తగ్గుతాయని, ప్రజలు ఇతరులపై ఆధారపడతామని, పర్యావరణ ముప్పు కూడా పొంచి వుందని వివరించారు.
భారీ స్థాయిలో జరిగే సామూహిక ఉత్పత్తి వల్ల ఈ ప్రమాదం వుందని, అదే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు ఇందుకు భిన్నమని తెలిపారు. వీటి ఉత్పత్తి విధానం స్థానికంగా వుండే ప్రజలకు ఉపాధిని కలిపిస్తుందని, పర్యావరణం కూడా కాపాడబడుతుందని తెలిపారు. వీటన్నింటితో పాటు వ్యక్తులు స్వావలంబన, గౌరవంతో జీవించడానికి కూడా వీలు కల్పిస్తుందని, అందుకే MSME అతి ముఖ్యమైన రంగమని తెలిపారు.

ఈ దిశగానే మనం కదులుతున్నామని, ప్రతిచోటా పురోగతి సాధిస్తున్నామని మోహన్ భాగవత్ తెలిపారు. వేగం మరియు పర్యావరణం ఇంకా మనం కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా సరైన దిశలో స్థిరంగా కదులుతోందని అన్నారు. ప్రపంచ వాణిజ్య పోటీలో ముందుండటం, ఉత్పత్తుల శ్రేష్ఠతను పెంపొందించడం మరియు ప్రపంచ పోటీతత్వంలో భారత్ ఎల్లప్పుడూ ముందుండేలా చూసుకోవడం – ఇవి మనం కృషి చేస్తున్న లక్ష్యాలని, ఇది నిజంగానే సానుకూల సంకేతమని తెలిపారు.
భారత సంప్రదాయంలో వ్యాపారం అనేది జీవనోపాధిని కల్పిస్తోందని, కానీ.. దీని సారంశం సేవే అని తెలిపారు. వ్యాపారానికి కూడా ధర్మమే మార్గనిర్దేశనం చేస్తోందని, సమాజం అభివృద్ధి చెందాలంటే, వ్యక్తులు సమిష్టి మంచికి బాధ్యత వహించాలని నమ్ముతామన్నారు.వ్యక్తి నుండి కుటుంబం వరకు, కుటుంబం నుండి సమాజానికి, సమాజం నుండి ప్రపంచం వైపు ఎదగాలని, మానవత్వం, సృష్టి ఒకదానితో ఒకటి అనుసంధానించబడే వుంటుందని, ఇదే భారతీయ ధృక్కోణం అని వివరించారు.
లఘు ఉద్యోగ భారతి అనేది ఎంట్రాప్రెన్యూర్స్ కి సహకారాన్ని ఇవ్వడం అన్న దానిని లక్ష్యంగా పెట్టుకుందని, తద్వారా పెద్ద చిన్న పరిశ్రమలు కలిసే విస్తరిస్తాయని అన్నారు. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తరచుగా అధిక లాభాల ఆధారిత ఉద్దేశ్యాలతో నడుస్తాయని, ఇది ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆర్థిక, సామాజిక సవాళ్లకు దారితీస్తోందన్నారు. దీనిని సరిదిద్దాలంటే మానవుల మనస్తత్వం మారాలన్నారు. ఎంట్రాప్రెన్యూర్స్ మధ్య సహకారాన్ని పెంపొందించడం లఘు ఉద్యోగ భారతి లక్ష్యాలలో ఒకటి, దీని ద్వారా వారి మధ్య సుహృద్భావన వస్తుందని, సామరస్యంతో పని చేస్తారని వివరించారు. మానవ పురోగతికి మెరుగైన ఆర్థిక మార్గాన్ని రూపొందించాలని సూచించారు.

వ్యక్తులు, దేశాలు జీవనోపాధి కోసం ఇతరులపై ఆధారపడినప్పుడు వారి స్వాతంత్రం బలహీనపడుతుందని, మానవత్వం, స్వేచ్ఛ, సమానత్వం విలువైందని అంటారని, స్వేచ్ఛ వుంటే సమానత్వం అదృశ్యమవుతుందని, సమానత్వం వుంటే స్వేచ్ఛ తరుచుగా అదృశ్యమవుతుందని అన్నారు.ఈ రెండింటి మధ్య సమతుల్యత సోదర స్ఫూర్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, ఇది వ్యక్తిగత జీవితాన్ని దాటి పరిశ్రమ మరియు వాణిజ్యం వరకు విస్తరించి ఉంటుందన్నారు.భారత్ ఎప్పటి నుంచో ఇదే విధానాన్ని అవలంబిస్తోందని, పరిశ్రమలు మరియు వాణిజ్యం ఒకప్పుడు సామరస్యంగా పనిచేశాయని, సంపన్నమైన మరియు సమతుల్య సమాజాన్ని సృష్టించాయని విలియం థార్న్టన్ తన రచనల్లో పొందుపరిచారని అన్నారు.
ఇప్పటి తరం ఈ నమూనానే పునరుద్ధరించాలని, అప్పుడు నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు.
మనం అభివృద్ధి పథంలోనే వున్నామని, ప్రపంచాన్ని కూడా ఇదే పథంలోకి నడిపించాలన్నారు. పోటీ కంటే నీతి, మానవ విలువలు, నైతిక బాధ్యత చాలా అవసరమని, భారత్ వ్యాపార రంగంలో ఎప్పుడూ దీనినే అనుసరిస్తోందని పునరుద్ఘాటించారు.





