
నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల కై వల్యరెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 2029లో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్‌గా ఎంపిక కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల ప్రాయంలోనే వివిధ కళలు, పోటీ పరీక్షల్లో తనకంటూ ప్రత్యేకత చాటుతూ ముందుకు దూసుకుపోతోంది. తల్లిదండ్రుల ప్రొత్సాహంతో అనేక పోటీల్లో విజయకేతనం ఎగువవేస్తూ ఎన్నో పతకాలను సొంతం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు మొదటి సంతానం కై వల్యరెడ్డి. తండ్రి పంచాయతీ ఈవోగా, తల్లి మనోజ్ఞ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్‌గా సామాజిక సేవ చేస్తున్నారు. కైవల్య నాలుగేళ్ల ప్రాయం నుంచే చిత్రలేఖనం, ఫ్యాన్సీ, డ్రెస్, వ్యాసరచన, వక్తృత్వం, కూచిపూడి, భరతనాట్యం, కరాటే వంటి పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
నాసా కోర్సు పూర్తి చేసిన కైవల్యరెడ్డి
అమెరికాలో 2023లో నాసా నిర్వహించిన కోర్సును కై వల్యరెడ్డి పూర్తి చేసింది. వ్యామగామి కావడమే లక్ష్యంగా అడుగులు వేసింది. నాసా అందిస్తున్న ఐఏఎస్పీ (ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్) కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నవంబర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం (ఐఏఎస్‌పీ) శిక్షణ అందిస్తోంది. విద్యార్థులకు పది రోజుల పాటు వ్యామగామికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 మందికి ఈ అవకాశం లభిస్తుంది. 2023లో భారత్ నుంచి ఎంపికై న వారిలో కై వల్యరెడ్డి ఒకరు. అతి చిన్న వయసులో ఐఏఎస్‌పీకి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న భారతీయురాలిగా రికార్డు సైతం నమోదు చేసింది. శిక్షణలో భాగంగా సొంతంగా విమానం నడపడం, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, జీరో గ్రావిటీ, స్కూబా డైవింగ్ తదితర అంశాలను నేర్చుకుంది.
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ (టీఎస్‌ఐ) ఆధ్వర్యంలో 2029లో చేపట్టనున్న అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికైంది. ఈ విషయాన్ని టీఎస్‌ఐ సీఈఓ నీల్ ఎస్.లచమన్ ఆమెకు తెలిపారు. ఎంతో క్లిష్టమైన ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం లచమన్, చీఫ్ ఆస్ట్రోనాట్ విలియం మెక్ ఆర్థర్, సీఓఓ అండ్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ వి.విజయ్‌ల బృందం కైవల్యరెడ్డిని ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
కైవల్యకు టీఎస్‌ఐ నాలుగేళ్ల కఠినమైన ఆస్ట్రోనాట్ శిక్షణను అందించనుంది. మూడు దశాబ్దాల అనుభవంతో 224 రోజులు అంతరిక్షంలో గడిపి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) కమాండర్‌గా ఆరునెలలు సేవలందించిన నాసా వెటరన్ ఆస్ట్రోనాట్, టీఎస్‌ఐ చీఫ్ ఆస్ట్రోనాట్ విలియం బిల్ మెక్ ఆర్థర్‌తో పాటు బ్రెజిల్ తొలి వ్యోమగామి, టీఎస్‌ఐ డిప్యూటీ చీఫ్ ఆస్ట్రోనాట్ మార్కోస్ పోంటెస్, వ్యోమగామి శిక్షకుడు డాక్టర్ వ్లాదిమిర్ ప్లెట్సర్, టీఎస్‌ఐ చీఫ్ ఇంజినీర్ అండ్ సీఓఓ డాక్టర్ వి. విజయ్, మానసిక సంసిద్ధత నిపుణురాలు డాక్టర్ మిండీ హోవార్డ్ వంటి అంతర్జాతీయ నిపుణుల మార్గదర్శకత్వంలో కైవల్యరెడ్డి శిక్షణ పొందనున్నారు.
జీరో గ్రావిటీ పారాబొక్ ఫ్లైట్స్, స్కూబా డైవింగ్, ఈవా డైవింగ్, న్యూట్రల్ బోయన్సీ శిక్షణ, హై–ఆల్టిట్యూడ్ స్కై డైవింగ్, హైకింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత అభ్యర్థులు తమ మిషన్ అసైన్‌మెంట్లు అందుకుని, అధునాతన శిక్షణ దశలోకి ప్రవేశించి శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు మొదటి సంతానం కైవల్యరెడ్డి. ఇంటర్ పూర్తి చేసుకుని ఆస్ట్రో ఫిజిక్స్‌లో డిగ్రీ చేయనుంది.
దేశానికి సేవలందించమే నా లక్ష్యం
ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి సేవలందించమే నా లక్ష్యం. చిన్నతనం నుంచి ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉంది. అంతరిక్ష వ్యామగామి కల్పనా చావ్లా, స్టీఫెన్ హాకింగ్, అబ్దుల్ కలాం అంటే ఎంతో ఇష్టం. వారిని ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవలందిస్తాను. తల్లిదండ్రుల నన్ను ఎంతగానో ప్రొత్సహిస్తున్నారు.– కుంచాల కైవల్యరెడ్డి, నిడదవోలు





