News

26/11 ముంబై దాడులపై పాక్ అధ్యక్షుడి సన్నిహితుడి సంచలన వ్యాఖ్యలు..

59views

పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ తన కొత్త పుస్తకంలో 26/11 ముంబై దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో శాంతిగా ఉండేందుకు జర్దారీ అంగీకరించడం, అణ్వాయుధాలపై ‘‘నో ఫస్ట్ యూజ్’’ అనే విధానాన్ని ప్రతిపాదించినందుకే దాడులు జరిగినట్లు చెప్పారు. ‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్’లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బాబర్ ఈ విషయాలు తెలిపారు. జర్దారీ శాంతి ప్రతిపాదన పాకిస్తాన్ లోని యుద్ధోన్మాదులను రెచ్చగొట్టిందని చెప్పారు.

భారత్ కూడా అణ్వాయుధాల విషయంలో ‘‘నో ఫస్ట్ యూజ్’’ విధానానికి కట్టుబడి ఉంది, పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలను మొదట ఉపయోగించదని జర్దారీ బహిరంగ ప్రతిపాదన చేయడం పాకిస్తాన్ లోని సైనిక వ్యవస్థను రెచ్చగొట్టిందని పుస్తకంలో పేర్కొన్నారు. జర్దారీ ఈ ప్రకటన ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత నవంబర్ 26, 2008న ముంబైలో పాకిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేసి 166 మందిని చంపినట్లు బాబర్ రాశారు. ఈ దాడులు భారత్‌తో శాంతి ప్రయత్నాలు దెబ్బతీసేందుకు చేసినవే అని అన్నారు.

తన పుస్తకంలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలను కూడా బాబర్ పేర్కొన్నాడు. ముషారఫ్ దేశాధినేతగా దిగిపోయిన తర్వాత, 2008లో జర్దారీ అధ్యక్ష పదివిలోకి రావడం పాక్ సైన్యానికి ఇష్టం లేదని, ఆర్మీ చీఫ్ జనరల్ అష్పాక్ పర్వేజ్ కయానీ అధ్యక్ష పదవిలో జర్దారీని ఉంచడం నచ్చలేదు అని చెప్పారు. ఆ సమయంలో జర్దారీకి బదులుగా కయానీ సింధ్ మాజీ సీఎం, రక్షణ మంత్రి అఫ్తాబ్ షాబాన్ మిరానీని అధ్యక్షుడిగా చూడాలనుకున్నారని వెల్లడించారు.

పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్ర మార్గాన ముంబైకి వచ్చిన 10 మంది లష్కరే తోయిబా టెర్రరిస్టులు ముంబైలో భారీ దాడులు చేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ 2005 నుంచే లష్కరే ద్వారా ఈ దాడులకు ప్లాన్ చేసింది. 26/11 దాడుల్లో తాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్, సీఎస్టీ స్టేషణ్, చాబాద్ హౌజ్ వంటి వాటిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. 60 గంటల పాటు ఈ మారణహోమం జరిగింది.