ArticlesNews

భక్తాగ్రేసరుడు కనకదాసు

49views

( నవంబరు 8 – కనకదాసు జయంతి )

పరమ భక్తుడు, తత్వవేత్త, సంగీతకారుడు, కవి, స్వరకర్త.. కనకదాసు. ఆయన కర్ణాటక రాష్ట్రం హావేరీ జిల్లా, బాడా గ్రామంలో 1509 సంవత్సరంలో కార్తిక బహుళ చవితి నాడు జన్మించాడు. తల్లిదండ్రులు బీరప్ప, బాచమ్మ దంపతులు. ఆయన రచించిన కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆ కీర్తనల్లోని తాత్విక భావాలు సాధారణ ప్రజానీకానికి కూడా అర్థమయ్యేలా సరళ భాషలో ఉండటం విశేషం.

కనకదాసు అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. చిన్న వయసులోనే వేదాంత ధోరణిని అలవరచుకుని మహా భక్తుడయ్యాడు. నరసింహ స్తోత్రం, మోహన తరింగిణి, నలచరిత్ర, హరిభక్తిసార తదితర భక్తి గ్రంథాలు రచించాడు.

కనకదాసుకు ఉడిపితో ప్రత్యేక అనుబంధం ఉంది. వ్యాసరాయ స్వామిజీ అభ్యర్థన మేరకు కనకదాసు ఉడిపికి వెళ్లాడు. అస్పృశ్యత పేరుతో కొన్ని కులాలను హీనంగా చూసే కాలమది. కనకదాసు ఆలయంలోకి వెళ్లాలని ప్రయత్నించగా పూజారులు అనుమతించలేదు. వ్యాసరాయ స్వామిజీ చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో గుడి బయటే భక్తి పారవశ్యంతో శ్రీకృష్ణ కీర్తనలు గానం చేశాడు. అలా కొన్ని వారాలపాటు ఆలయం వెలుపలే కాలం గడిపాడు. ఒకరోజు ఆలయ ప్రహరీ గోడకు పగులు ఏర్పడింది. ఆ పగులు గుండా స్వామిని దర్శించుకున్నాడు. విగ్రహం కనకదాసు వైపు తిరిగినట్లు కనిపించింది. ఉడిపి దేవాలయం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ.. కృష్ణుడి విగ్రహం మాత్రం పడమర ముఖంగా దర్శనమిస్తుంది. కనకదాసు భక్తి గోడను బీటలు పడేలా చేసి దైవాన్ని తన దిక్కుకు మళ్లించుకుందని చెబుతారు. ఆ మహా భక్తుడి జయంతిని సెలవుదినంగా ప్రకటించి, పండుగలా నిర్వహిస్తుంది కర్ణాటక ప్రభుత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనకదాసు జయంతి రాష్ట్ర పండుగలా నిర్వహిస్తుంది