
కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 1 వ భాగం
కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 2వ భాగం
గురువాయూర్ ఆలయంలో
నిజానికి శబరిమలై గుడిలో బంగారం అవకతవ కల మీద గగ్గోలు మొదలయిన నేపథ్యంలో గురు వాయూర్ రగడ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం గురువాయూర్ దేవసం ఆస్తుల మీద 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాలలో జరిపిన ఆడిట్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి. మరమ్మతుల పేరుతో, మెరుగుల పేరుతో బయటకు పంపించిన బంగారు, వెండి వస్తువులు తిరిగి యథాతథంగా ఆలయానికి చేరాయా లేదా అన్న ఆరా దేవసం చేయలేదని ఆడిట్‌లో వెల్లడయింది. దేవసం ఏలుబడిలో బంగారు, వెండి వస్తువుల విషయంలో ఆశ్రద్ధగా ఉండడమే కాదు, ఆదాయ వ్యయాల మధ్య పెద్ద అగాథమే ఉందని, పద్దులు కూడా ఏమాత్రం సజావుగా లేవని ఆడిట్ గుట్టు విప్పింది. గురువాయూర్ ఆలయంలో జూలై 2012 తరువాత జరిగిన నిర్ణయాలను ఆడిట్‌కు తెలియ కుండా దాచారని కూడా నివేదిక వెల్లడిరచింది. తాము ఆ కాలంలో తీసుకున్న ఏ నిర్ణయాలను ఆడిట్‌కు సమర్పించరాదని 2015లోనే దేవసం సభ్యులు నిర్ణయించుకున్నారు. ఇది కదా కమ్యూనిస్టు నిజాయితీ!
2019-2020 సంవత్సరంలో ఆడిట్ చేసిన వారికి ఇంకొన్ని విస్తుపోయే విషయాలు కూడా తెలిశాయి. బడ్జెట్‌కూ, వాస్తవంగా వచ్చిన ఆదాయా నికి, వ్యయానికి మధ్య పొంతన లేదు. మదుపు చేసిన మొత్తాల మీద వచ్చిన ఆదాయం, విరాళాలు, కేపిటల్ రిసీట్లు, పన్ను చెల్లింపులకు సంబంధించి పొంతన లేని లెక్కలే ఉన్నాయి. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధమని వేరే చెప్పక్కరలేదు. గురువాయూర్ దేవసం నిబంధనలు 1980 ప్రకారం గుడి నిర్వహణాధికారి అన్ని విలువైన వస్తువులకు సంబంధించిన జాబితాను దగ్గర ఉంచుకోవాలి. మేనేజ్‌మెంట్ కమిటీలు ఆ జాబితానూ, అందులో నమోదు చేసిన వస్తువులనూ ప్రతి ఏటా తనిఖీ చేయాలి. దీనికి సంబంధించిన నివేదికను దేవసం కమిషనర్‌కు నివేదించాలి. కానీ ఇలాంటి పనేదీ కూడా ఆ నిబంధనలు అమలులోకి వచ్చిన 1980 నుంచి ఏ ఒక్క ఏడాది జరగలేదు. గురవాయూర్ ఆలయానికి సంబంధించిన విలువైన వస్తువులకు సంబంధించిన పత్రాలను 2019లో ఆడిటర్లు కోరితే వాటి ఊసే ఎత్తలేదు. చట్టబద్ధమైన అకౌంటింగ్ విధానం కూడా ఆలయంలో లేదు. బంగారు, వెండి కానుకలకు తప్ప, మిగిలిన వాటికి ఎలాంటి రసీదులు ఇవ్వలేదు. 2020-2021లో అయిన వ్యయం రూ 25 కోట్లుగా చూపించారు. అయితే అది ఆదాయానికి కంటే చాలా ఎక్కువ. దాని పరిధిలోని ఆలయాల వ్యయం వాటి ఆదాయం కంటే మూడు రెట్లు కనిపించింది.
2019 సంవత్సరం ఆదాయ వ్యయాల మీద జరిపిన ఆడిట్ ప్రకారం గురువాయూర్‌లో కొన్ని ఆస్తులకు కాళ్లు వచ్చాయని తేటతెల్లమయింది. బంగారంతో పాటు, ఏనుగు దంతం కూడా మాయ మయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న బంగారం పథకంలో పెట్టుబడుల వల్ల రూ. 79 లక్షల నష్టం వాటిల్లింది. గురువాయూర్ దేవసం పరిధిలో 12 ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో చాలా ఆస్తులకు జవాబుదారీ లేదు. రెండువేల కిలోల బరువైన వంట పాత్రలు పోయాయి. వీటి విలువ రూ. 15 లక్షలు. ఇవేమీ ఆడిట్ అధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఈ వంట పాత్రలు పాలక్కాడ్‌కు చెందిన ఒక వ్యక్తి విరాళంగా ఇచ్చారు. పున్నాథూర్ ఏనుగుల కోట నుంచి 530 కిలోల ఏనుగు దంతాల లెక్క లేదు. కానీ ఈ తేడాపాడాలన్నీ సరిచూసి హైకోర్టుకు నివేదిక ఇచ్చామని దేవసం చెబుతోంది. 2020-2021 ఆడిట్‌లో ఆలయాల అతిథి గృహాలు సహా ఇతర అన్ని వ్యవస్థల మీద చేసిన ఖర్చు రూ 25 కోట్లుగా చూపారు. కానీ అది ఆదాయానికి మించి చాలా ఎక్కువ. ఆ ఆర్థిక సంవత్సరంలోనే దేవాలయాల మీద చేసిన వ్యయం ఆదాయం కంటే మూడు రెట్లు అధికంగా ఉంది. ఇదంతా కేరళలోని హిందూ దేవాలయాల మీద ఎర్ర బందిపోట్ల దోపిడీలకు పరాకాష్ట. ఈ ఆగడాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
సిబ్బంది, అర్చకుల చేతివాటం
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, దేవసం బోర్డులుతో పాటు కొందరు అర్చకులు, ఆలయ సిబ్బంది కూడా అయ్యప్పస్వామికి యథాశక్తిన అన్యాయం తలపెట్టారు. ధర్మం అనే మహోన్నత దృష్టికి మహాద్రోహం తలపెట్టారు. ట్రావెన్కూర్ దేవసం బోర్డు మాజీ అధ్యక్షుడు సీకే గుప్తన్ వెల్లడిరచిన ఒక విషయం తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. అయ్యప్ప ఆలయంలో తంత్రి (ప్రధాన అర్చకుడు)గా మోహనారు కాంతారురు గతంలో పనిచేశాడు. కానీ ఇతడు ఎర్నాకులంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక కాల్‌గర్ల్‌తో పట్టుబడ్డాడు. దీనితో ఆయనను ఆలయం నుంచి బహిష్కరించారు. అతడు మళ్లీ గర్భగుడిలో విధులు నిర్వర్తించేందుకు మార్గం సుగమం చేస్తే కోటి రూపాయలు ఇస్తామని అతడి కుటుంబం బేరమాడిరదని గుప్తన్ తెలియచేశాడు. ఈ గుప్తన్ ఎవరో కాదు. సీపీఎం ప్రముఖుడు ఈఎంఎస్ నంబూద్రి అల్లుడు. తంత్రి, మేల్‌శాంతిల ఆగడాలకు హద్దు లేదు. ఇటీవలి కాలంలోనే వాజీ వాహనం (దేవుడి వాహనం) గురించి ఒక వార్త వచ్చింది. జెండా కర్ర వంటి దానికి పైన బంగారు గుర్రం ఉంటుంది. దీనిని కొడిమరం అంటారు. ఇది కనిపించకుండా పోయినట్టు వార్తలు వచ్చాయి. ఈ వాహనం బాధ్యత తంత్రిదే. దీని మీద దర్యాప్తు చేయించాలని ప్రస్తుత తంత్రి రాజీవ్ కాంతారును కొందరు భక్తులు కోరారు. వాజీ వాహనం తన వద్ద మాత్రమే ఉంటుందని చెప్పాడు. అంత ఖరీదైన వాహనం మీ దగ్గర ఎందుకు ఉండాలని నిలదీస్తే అతడి నుంచి సమాధానం లేదు. తంత్రి కావచ్చు, మేల్‌శాంతి కావచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను ఈ పదవులలో ఉన్నవాళ్లు దోచే తీరు కూడా భయానకం. మేల్‌శాంతి పూజాదికాలు నిర్వహిస్తాడు. వాటిని సరైన సమయంలో నిర్దేశించే విధంగా పర్యవేక్షించేవాడు తంత్రి.
గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కేరళలో హిందూత్వకు బెడద ఏర్పడిరది. కోర్టులు, రాజకీయ పార్టీలు, ముస్లిం మతోన్మాదులు మూకుమ్మడిగా హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇది గమనించడానికి హిందువులకు ఇంకా ఎంతకాలం పడుతుందో అర్ధం కావడం లేదు. హిందూ ఆలయాల పట్ల అత్యంత అమర్యాదకర ధోరణితో ఉన్న కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కూ ఇప్పటికీ ఓటు వేయడానికి వారికి మనసు ఎలా ఒప్పుతుందో అసలే అర్ధం కాదు.





