ArticlesNews

ఇక్షక్‌.. నౌకాదళానికి రక్షక్‌!

14views

భారత నౌకాదళంలో 150కిపైగా యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లున్నాయి. ఇప్పటి వరకు ఏ యుద్ధ నౌకలోనూ అతివలకంటూ ప్రత్యేక వసతులు లేవు. మొట్టమొదటి సారిగా మహిళా గౌరవానికి ప్రతీకగా నిలిచేలా సంధాయక్‌ క్లాస్‌ సర్వే నౌక ఐఎన్‌ఎస్‌ ఇక్షక్‌ని నిర్మించారు.

ఒక నేవీ షిప్‌లో మహిళా అధికారులు, సిబ్బందికి ప్రత్యేక వసతులు కల్పించడం ఇదే తొలిసారి. ఇది నౌకాదళంలో పెరుగుతున్న నారీశక్తికి నిదర్శనం. 80 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ సంధాయక్‌ క్లాస్‌ మూడో షిప్‌ ఇక్షక్‌.. నవంబర్‌ 6వ తేదీన భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరనుంది.

ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశలో కీలక అడుగు…
భారత నావికాదళంలో దేశీయంగా నిర్మించిన ఈ బిగ్‌ సర్వే వెసెల్‌ ఐఎన్‌ఎస్‌ ఇక్షక్‌.. ఆత్మనిర్భర్‌ భారత్‌లో మరో కీలక అడుగు. ఇండియన్‌ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠి ఇక్షక్‌ని కొచ్చి నావల్‌ బేస్‌లో జాతికి అంకితం చేయనున్నారు.

స్వదేశీ హైడ్రోగ్రాఫిక్‌ సర్వే ఎక్స్‌లెన్స్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించేలా కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) దీన్ని నిర్మించింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ షిప్‌ ప్రొడక్షన్, వార్‌షిప్‌ ఓవర్‌సీయింగ్‌ టీమ్‌ (కోల్‌కతా) ఈ నౌకా నిర్మాణాన్ని పర్యవేక్షించాయి. హైడ్రోగ్రాఫిక్‌ సర్వే కార్యకలాపాలతోపాటు.. మానవతా సహాయం, విపత్తు సహాయకారిగానూ.. అత్యవసర సమయాల్లో హాస్పిటల్‌ షిప్‌గా కూడా వ్యవహరించనుంది.

మహిళల కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌.!
భారత నౌకాదళ చరిత్రలో మహిళల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేసిన తొలి యుద్ధ నౌక ఇక్షక్‌. ఇప్పటి వరకూ ప్రతి యుద్ధ నౌకలో మహిళా అధికారులు, సెయిలర్స్‌కు పురుష సిబ్బందితో కలిసి పక్కపక్కనే విడిగా గదులు ఉండేవి. ఇక్షక్‌లో మాత్రం.. మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌ని ఏర్పాటు చేశారు.

ఇక్షక్‌ అంటే…
ఇక్షక్‌ అంటే ది గైడ్‌.. దిక్సూచీ అని అర్థం. తెలియని మార్గాల్ని అన్వేషించడం.. నౌకాదళాన్ని సరైన దారిలో నడిపించడం.. తమ లక్ష్యాల్ని సురక్షితంగా చేరుకునేలా నావికులకు మార్గాన్ని నిర్దేశించడం. భారత దేశ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసేలా ఇక్షక్‌ నిర్మాణం జరిగింది. ఓడరేవులు, నావిగేషనల్‌ చానెల్‌లు, ఎకనావిుక్‌ ఎక్స్‌క్లూజివ్‌ జోన్‌లో కోస్టల్, డీప్‌ వాటర్‌ హైడ్రో–గ్రాఫిక్‌ సర్వే నిర్వహించడం, రక్షణ కోసం ఓషనోగ్రాఫిక్‌ డేటాను సేకరించడంలో ఇక్షక్‌ కీలక పాత్ర పోషించనుంది.

అడుగులు ఇలా…
1968 నుంచి సంధాయక్‌ సర్వే వెసల్‌ భారత నౌకాదళంలో విశిష్ట సేవలందించి 2021లో సేవల నుంచి నిష్క్రమించింది. ఇండియన్‌ నేవీకి సర్వే నౌకలు అవసరమని భావించిన రక్షణ మంత్రిత్వ శాఖ.. 2017లో నాలుగు సంధాయక్‌ క్లాస్‌ సర్వే వెసల్స్‌ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. రూ.2,­435.15 కోట్లతో బిడ్‌ను జీఆర్‌ఎస్‌ఈ దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకల్ని నిర్మిస్తున్నారు.

వీటిలో మొదటిది జే18 పేరుతో ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ని 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. జే 19 పేరుతో ఐఎన్‌ఎస్‌ నిర్దేశిక్‌ను, జే23 పేరుతో ఇక్షక్‌ని 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి చేశారు. తర్వాత.. ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌ షిప్‌ 2026 నాటికి భారత నౌకాదళంలో చేరాలన్నది ప్రణాళిక.

ఇక్షక్‌ సత్తా ఇదీ..
పొడవు: 110 మీటర్లు
బరువు: 3,400 టన్నులు
వేగం: గంటకు 33 కిమీ (18 నాటికల్‌ మైళ్లు)
సామర్థ్యం: 30 కిమీ వేగంతో ఏకధాటిగా 12 వేల కిమీ దూరం ప్రయాణించగలదు. సంద్రంలో సత్తా: 25 రోజుల పాటు తీరానికి రాకుండా పహారా కాయగల సత్తా
సిబ్బంది: 231 మంది
ఆయుధ సంపత్తి: సీఆర్‌ఎన్‌91 నేవల్‌ గన్, హాల్‌ ధృవ్‌ ఎంకే–3 హెలికాప్టర్‌
ఇన్‌బుల్ట్‌ సెన్సార్‌ శక్తి: అటానమస్‌ అండర్‌ వాటర్‌ వెహికల్‌ సెన్సార్, హైడ్రోగ్రాఫిక్‌ సెన్సార్‌ పరికరాలు, సముద్ర కాలుష్యాన్ని గణించే మార్పల్‌ వ్యవస్థ, రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికల్స్‌(ఆర్‌వోవీ), సైడ్‌ స్కాన్‌ సోనార్‌