ArticlesNews

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 2వ భాగం

71views

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 1 వ భాగం ఇక్కడ చదవండి

శబరిమలై బంగారం దోపిడీ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 దేవాలయాలు ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు అధీనంలో ఉన్నాయి. శబరిమలై గుడి బంగారం వ్యవహారం ఏమిటి? గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకుల విగ్రహా లకు తాపడం చేయించిన (రాగి మీద) బంగారుపూత ఉండేది.30 కిలోల 24 కేరెట్ల బంగారంతో ఆ పూత పూశారు. వీటిని మరమ్మతుల పేరుతో బయటకు తీసుకువెళ్లారు. కానీ తిరిగి బంగారుపూత రాగిరే కులు దేవస్థానానికి తిరిగి వచ్చేసరికి 4.5 కిలోలలకు పైగా బంగారు తగ్గినట్టు బయటపడిరది. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి. శబరిమలై స్పెషల్‌ కమిషనర్‌, న్యాయస్థానాల అనుమతితో మరమ్మతులు జరగాలి. కానీ ఈ ప్రధాన నియమాన్ని దేవసం ఉల్లంఘించింది. శబరిమలై స్పెషల్‌ కమిషనర్‌ సెప్టెంబర్‌ 10న రాష్ట్ర హైకోర్టుకు ఇచ్చిన ఫిర్యాదు ఇవ్వడంతో ఇవన్నీ బయట పడ్డాయి. ప్రధాన ఆలయం గర్భగుడికి ఇరువైపులా ఉండే పీఠాలు, ద్వారపాలకు లకు చేసిన బంగారు తాపడం రేకులు మరమ్మతు పేరుతో తొలగించారని, ఆ విషయం తనకు తెలియ కుండానే జరిగిందని స్పెషల్‌ కమిషనర్‌ ఫిర్యాదులో తెలియచేశారు. అదృష్టం ఏమిటంటే, నీవు వెళ్లి ఈ విషయం అయ్యప్పకు చెప్పుకోమని న్యాయస్థానం అనలేదు. కమిషనర్‌ ఫిర్యాదుతో హైకోర్టు తనకు తానే దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించింది. 2019లో జరిగిన మరమ్మతులనూ, ఇప్పుడు జరిగిన మరమ్మతులలోనూ సరిచూసుకుని తూకంలో వచ్చిన తేడాను గమనించింది. కోర్టు కూడా నిర్ఘాంతపోయేటంత దారుణం బయట పడిరది. దర్యాప్తు చేయవలసిందిగా అక్టోబర్‌ 6న ఇచ్చిన ఆదేశాలలో కోర్టు ఆ విషయం స్పష్టం చేసింది కూడా. మరమ్మతుకోసమంటూ ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు 2019లో రాగి రేకులుగా పేర్కొన్నది. నిజానికి 1999లో ద్వారపాలకుల విగ్రహాలను, పీఠాలను బంగారంతో తాపడం చేశారు. ఎలాంటి శషభిషలు లేకుండా కోర్టు దేవసం బోర్డును నిలదీసింది. బంగారు తాపడాన్ని మీరు రాగిరేకులు మాత్రమే అన్నట్టు రాసి, ఎలా బయటకు పంపారు? ఒక నమ్మదగని స్పాన్సరర్‌కు ఎందుకు ఇచ్చారు? అసలు ఈ మొత్తం వ్యవహారంలో సరైన రికార్డులు ఎందుకు లేవు? ఇవి కోర్టు వేసిన ప్రశ్నలు. ఆ తరువాతే న్యాయమూర్తి కేటీ శంకరన్‌ నాయకత్వంలో ఆలయంలో విలువైన వస్తువుల స్థితిగతులపై దర్యాప్తు సంఘాన్ని నియమిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ మొత్తం అవినీతి వ్యవహారమంతా సీపీఎం పదేళ్ల హయాంలోనే జరిగింది. ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు అధ్యక్షుడు, సభ్యులు అంతా అధికార పార్టీ వారే. అంటే సీపీఎం సభ్యులే. దోపిడీ అయిన బంగారాన్ని కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కర్ణాటకలోని బళ్లారిలోని ఒక బంగారం దుకాణం నుంచి స్వాధీనం చేసుకున్నది. బంగారం తస్కరణలో దేవసం శాఖ మంత్రి వీఎన్‌ వాసవన్‌ హస్తం ఉందని కేరళ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

శబరిమలై ఆలయంలో గర్భగుడికి ఇరువైపులా ఉండే ద్వారపాలకులు, సన్నిధానంలో కొన్ని భాగాలు, శ్రీకోవిల్‌ ప్రవేశద్వారం, పైకప్పులకు బంగారు తాపడం కోసం 1998లో ఒక దాత విరాళం ఇచ్చాడు. ఆయనే యునైటెడ్‌ బ్రూవరీస్‌ గ్రూప్‌ అధ్యక్షుడు విజయ్‌ మాల్యా. అప్పుడు ఆయన ఇచ్చినది రూ. 18 కోట్లు. అయితే వాటి మీద ఉన్న బంగారం తాపడం సంగతి ప్రస్తావించకుండా రాగిరేకులని రాశారు. రాగి రేకుల మీద పూత రూపంలో ఉన్న ఆ బంగారాన్ని దోచేయడానికే ఇదంతా జరిగింది. బంగారం తాపడం కోసం 30.291 కిలోల బంగారం ఉపయోగించినట్టు ఆ గ్రూప్‌ తెలియ చేసింది. ఈ తాపడం రేకుల మరమ్మతు పనిని బెంగ ళూరుకు చెందిన మలయాళీ వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్‌ పుట్టికి అప్పగించారు. ఆదరాబాదరా ఈ పని కోసం, అంటే తాపడం రేకులను మళ్లీ తయారు చేయడానికి తాను చెన్నయ్‌ లోని స్మార్ట్‌ క్రియేషన్స్‌ అనే సంస్థకు అప్పగించానని పుట్టి తెలియచేశాడు. కానీ ఇలా బంగారు తాపడం చేసే సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు ఆ సంస్థ వద్ద లేవు. మరి దానికి ఎందుకు ఎంపిక చేశారు? ఇదే అసలు ప్రశ్న.

ఎవరీ ఉన్నికృష్ణన్‌ పుట్టి? దేవుడికి ఇంత ద్రోహానికి ఒడిగట్టిన ఈ వ్యక్తి ఒకప్పుడు దేవస్థానం లోని వాడేనంటే నమ్మక తప్పదు. పరికార్మి అనే బాధ్యతను నిర్వహించేవాడు. అంటే ప్రధాన అర్చకుడు (మేల్‌శాంతి) కింద సహాయకులలో చిట్టచివరివాడు. ఇప్పుడు వ్యాపారవేత్త అవతారం ఎత్తాడు. మనీ లాండరింగ్‌ ఆరోపణలు కూడా ఉన్నాయి. అధిక వడ్డీరేట్లకు రుణాలు ఇస్తాడని పేరు ఉంది. ఆలయం ద్వారా వెనకేసిన సొమ్ముతో రియల్‌ దందా కూడా నడుపుతున్నాడు. ఈ నిర్వాకమంతా కేవలం పుట్టి ఘనతేనని అనుకోరాదని, వెనుక ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు పెద్ద తలలే కాకుండా, రాజకీయ పార్టీల పెద్దమనుషులూ ఉన్నారని మాజీ ప్రధాన అర్చకుడు జjరామన్‌ నంబూద్రి ఆరోపించారు. నిజానికి పుట్టి చేసిన దోపిడీ గతంలో దేవసం బోర్డు అధికారులు, మంత్రులు చేసిన దోపిడీతో పోలిస్తే పెద్ద ఎక్కువేమీ కాదని ప్రధాన భద్రతాధికారి గోపాలకృష్ణ చెప్పారు. ఈ బందిపోటుతనంలో కేరళ ఆలయాల మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌, ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు మాజీ అధ్యక్షుడు ఏ. పద్మకుమార్‌ కీలకమని చెబుతున్నారు. ఇప్పుడు దోషులు ఎంతవారైనా శిక్షిస్తాం, బాదేస్తాం అని సీపీఎం ప్రభుత్వం చెప్పడానికి కారణం` పుట్టి చాలా పేర్లు బయటపెట్టే అవకాశం ఉందని భయపడడమే.

నిజానికి ఇలా శబరిమలై నుంచి స్వామివారి ఆస్తులను బయటకు తీసుకువెళ్లడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఆ నిబంధనలను కూడా తిరువాన్కూర్‌ దేవసం బోర్డే తయారు చేసింది. ఈ మరమ్మతు అయినా ఆలయ ప్రాంగణంలోనే చేయించాలి. దేవసం బోర్డు సభ్యులు బయటకు పంపించినవి బంగారు తాపడం రేకులు. కానీ రాగిరేకులను పంపినట్టు రాశారు. మొత్తం 42.8 కిలోల బరువు ఉన్న12 రాగిరేకులట.ఇదీ ఇచ్చిన సమాచారం. మరమ్మతులు అయ్యాక తిరిగి వచ్చాయి. అప్పుడు వాటి బరువు 38.258 కిలోలని తేలింది. అంటే 4.541 కిలోలు ఎక్కడో కరిగిపోయాయి. అయితే తూకంలో దాదాపు ఐదు కిలోలు ఎందుకు తగ్గిందని అడిగినవాడు ఎవడూ లేడు. ఇంత బంగారం నొక్కేసినా 2025లో విగ్రహాల పునఃప్రతిష్ఠ పనిని ఆ ఉన్నికృష్ణన్‌కే అప్పగించారు. అయితే సరిగ్గా హైకోర్టు అడ్డుపడిరది. 2019లో మరమ్మతులకు ఇచ్చినప్పుడు ఆ పనిచేసిన వాళ్లు ఇచ్చిన వారంటీ 40 ఏళ్లు. మరి 2025లో మళ్లీ ఎందుకు మరమ్మ తులు? ఇదే న్యాయస్థానం ప్రశ్న.

తరువాత పోయిన బంగారు వస్తువులన్నీ ఉన్నికృష్ణన్‌ సోదరి మిని ఇంటిలో చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి, సెక్యూరిటీ అధికారి కనుగొన్నారు. అయితే ఆ వస్తువులను తన సోదరుడే తెచ్చి పెట్టాడని ఆమె చెప్పారు. ఉన్నికృష్ణన్‌ కూడా చాలాసార్లు మాట మార్చాడు. తాను మరమ్మత్తు కోసం స్పాన్సర్‌ చేసిన పీఠాల మీది రేకులు కనిపించడం లేదని మొదట అన్నాడు. తరువాత అవి రాగి రేకులని, బంగారం మాత్రం కాదని చెప్పాడు. మరమ్మతుల పేరుతో తతంగం పూర్తి చేసిన తరువాత వాటిని విరాళాల సేకరణ కోసం ఉన్నికృష్ణన్‌ బెంగళూరు, తమిళనాడు లలో ప్రదర్శనకు పెట్టాడు. అప్పుడు మాత్రం బంగారు తాపడం రేకులనే ప్రదర్శనకు పెట్టాడు.

అక్టోబర్‌ 23న ప్రత్యేక దర్యాప్తు బృందం శబరిమలై పరిపాలనాధికారి మురారిబాబును అరెస్టు చేసింది. ద్వారపాలకులకు చేసిన బంగారు తాపడం సంగతి దాచి అవన్నీ రాగిరేకులంటూ 2019 లోను, 2025లోను కూడా రాసింది ఇతడే. 1998-99 సంవత్సరాలలో విజయ్‌ మాల్యా ఇచ్చిన బంగారాన్ని దొంగిలించడానికే ఇదంతా జరిగిందని దర్యాప్తు అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఉన్నికృష్ణన్‌తో పాటు దేవసం మాజీ అధ్యక్షుడు ఏ పద్మాకర్‌, మరొక ఇద్దరు సభ్యులను, తొమ్మిదిమంది అధికారులను కూడా అరెస్టు చేశారు. ఈ పద్మాకర్‌ సీపీఎం సీనియర్‌ సభ్యుడే. ఈ నేరమంతా నా మీదే మోపితే ఎలా? ఇంకా జవాబుదారులు చాలా మంది ఉన్నారు కదా అని అమాయకంగా అడుగుతున్నాడు పాపం. ఈ బంగారం దొంగతనానికి, ప్రస్తుత బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ చెప్పాడు. కాబట్టి తమ మీద ఆరోపణలు చేయడం తగదని అంటున్నాడు. కమ్యూనిస్టు కాబట్టి దోషం అంటగట్టక్కరలేదు. కానీ జరిగిన అవకతవకలను ఎందుకు పట్టించుకోలేదు? ప్రభుత్వం దృష్టికో, కోర్టు దృష్టికో ఎందుకు తీసుకువెళ్లలేదు. తన పార్టీ అడ్డంగా సాగించిన దోపిడీ బయటపడుతుందనే కావచ్చు.

ఈ మధ్య అయ్యప్ప భక్తుల మీద, అయ్యప్ప మీద ఆపేక్ష పెరిగిపోయిన సీపీఎం ప్రభుత్వంలో భాగమైన బోర్డు ఇంకొక మాట కూడా చెబుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో త్వరలో జరగబోయే అయ్యప్ప దీక్షకు ఎలాంటి విఘాతం కలిగించరాదని కోరుతున్నట్టు కూడా ప్రశాంత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అరవై లక్షలమంది అయ్యప్ప భక్తులు శబరిమలై వస్తారు. వారి గురించి ప్రశాంత్‌ ఇప్పటి నుంచి గుబులు పడుతున్నాడని మనం నమ్మక తప్పదు. అయితే ఇదంతా దొంగతనం కంటే తక్కువ దేమీ కాదని కేరళ ఆలయాల మంత్రి వీఎన్‌ వాసవన్‌ ఒక మాటయితే అన్నారు. ఇక నిజాయితీకీ నీతికీ, పాలనా దక్షతకీ నిలువెత్తు రూపమని మేధావులు, పురోగమన వాదులు చిత్రించే ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ అయితే అక్రమాలకు పాల్పడేవారిని తమ ప్రభుత్వం ఏనాడూ విడిచిపెట్టదని తేల్చి పారేశారు. ఇది జోక్‌ కంటే తక్కువేమీ కాదు.