ArticlesNews

టెక్నాలజీ గోవుతో గృహా ప్రవేశం

54views

హిందూ సంప్రదాయాల్లో ఆవుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆవును దేవతగా పూజిస్తారు. ఆవు పృష్ఠ భాగాన్ని దర్శనం చేయడం, ఆవును పూజించడం, ఆవు ఆకలి తీర్చేందుకు గడ్డి వేయడం వలన పుణ్యం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. గృహ ప్రవేశ సమయంలో ఆవును గృహంలో తిప్పడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఆవు, ఎద్దు పాదాల నుంచి అమృత బిందువులు స్రవిస్తాయని, వీటితో వ్యవసాయం చేయడం వలన అమృత బిందువులు పొలంపై పడి ఆహరం ఆరోగ్యకరంగా మారుతుందని పూర్వీకుల విశ్వాసం. ఆవు పాలు తల్లిపాలతో సమానమని చెబుతారు. తల్లిలేని పిల్లలకు తల్లిపాలు కరువైతే ఆవు పాలను తాగిస్తారు. ఆవు పాలు పలచగా ఉండటంతో చిన్నారులకు త్వరగా జీర్ణం అవుతాయి. అలాగే చిన్నారులు ఆరోగ్యకరంగా ఉంటారు. ఇక ఎద్దు రైతన్నకు తోడుగా ఉంటూ.. వ్యవసాయానికి సాయం చేస్తుంది. రోజంతా అలసిపోకుండా అన్నదాతకు సహాయంగా మొక్కలను తొక్కకుండా జాగ్రత్తగా నడుస్తూ వ్యవసాయానికి సహకరిస్తుంది. దేశానికి వెన్నెముక అయిన రైతుకు చేదోడుగా ఆవు, ఎద్దులు నిలుస్తాయి. అందుకే ఈ మూగజీవాలను ఒక జంతువుగా కాకుండా తమ కుటుంబ సభ్యులుగా రైతులు భావిస్తారు.

ఇక సనాతన సంప్రదాయం ప్రకారం ఆవుకు చాలా ప్రత్యేకత ఉంది. సమస్త దేవతలు ఆవులో కొలువుంటాయని వేదాలు చెబుతున్నాయి. ఆవు యొక్క పృష్ఠభాగం అంటే పేడ వచ్చే భాగంలో శ్రీ మహాలక్ష్మీ దేవి కొలువుంటుందని చెబుతారు. అలాంటి ఆవును పూజించడంతో పాటు ముఖ్యంగా గృహ ప్రవేశాల్లో గృహంలోకి ఆహ్వానించి ఇంటి చుట్టూ తిప్పడం విశేష ఫలితాన్ని ఇస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తమ కుటుంబం పిల్లాపాపలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని పరమేశ్వరుడిని భక్తులు ప్రార్థిస్తారు. ఆధునిక కాలంతో వ్యవసాయం చేసే విధానం మారుతోంది. టెక్నాలజీ సహాయంతో గోవులతో కాకుండా, యంత్రాలతో వ్యవసాయం చేసే కల్చర్ వచ్చింది. మూగ జీవాలను పెంచేవారే కరువయ్యారు. గ్రామాల్లో మూగజీవాలు కనిపిస్తున్నా.. పట్టణాల్లో పూర్తిగా కరువయ్యాయి.

పట్టణాల్లో ఆవులు, ఎద్దులను పెంచేవారు లేరు. పట్టణాల్లో గృహప్రవేశాలు చేసుకుంటే.. గోమాతను ఇంటిలో తిప్పుదామంటే గోవులు అందుబాటులో ఉండట్లేదు. దీంతో బ్రాహణులు సైతం పూజా కార్యక్రమాల్లో గోవును పూజించే క్రమంలో గోవు బొమ్మను పెట్టి పూజిస్తున్నారు. ఇక ఇంట్లో గోమాతను తిప్పేందుకు ప్రత్యామ్నాయంగా గోవు బొమ్మను వాడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో నిర్వహించుకున్న పూజా కార్యక్రమంలో గోవుకు బదులుగా గోవు బొమ్మను పూజలో వినియోగించారు. ఆ బొమ్మకే పూజలు నిర్వహించారు. గోవుపై అభిమానంతో గోమాత లేకపోయినా.. బొమ్మ గోవుతో పూజ చేసుకున్నారని పలువురు ప్రశంసిస్తున్నారు.

అయితే సత్బ్రహ్మణులు.. ఇలా చేయడం సంతోషం కలిగించే విషయమే అయినా, నిజమైన గోవునే పూజించాలని అంటున్నారు. దేశానికే వెన్నెముక అయిన రైతులకు చేదోడుగా ఉండే గోవులు కరువవ్వడం చాలా బాధాకరమైన విషయమని అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ గోవు సంతతి పెరుగుతుందో అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉంటారని, సకాలంలో పంటలు పండుతాయని చెబుతున్నారు. బొమ్మ గోవుతో పూజలు ప్రోత్సహించడం మంచిది కాదని చెబుతున్నారు. గోవు సేవ చేసి, దానికి కడుపునిండా గడ్డి పెట్టి, గో సంరక్షణే ధ్యేయంగా మన పూజలు ఉండాలని వేద పండితులు చెబుతున్నారు.