
తమిళనాడు హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బహిరంగ స్థలం) అనేది ఏ ఒక్క మతానికో పరిమితం కాదని తేల్చి చెప్పింది. చెన్నైలోని దిండిగల్ జిల్లా పంచంపట్టి గ్రామంలోని కాళియమ్మన్ దేవాలయ మహాకుంభాభిషేకం సందర్భంగా నిర్వాహకులు అన్నదానం జరపాలని నిర్ణయించారు. దీనిని క్రైస్తవ చర్చి వ్యతిరేకించింది. అది తమ స్థలమంటూ పేర్కొంటూ… అన్నదానాన్ని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే మద్రాసు హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.
అసలు జరిగింది ఏమిటంటే…
దేవాలయం మహాకుంభాభిషేకం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక సుంకసవాడి గ్రౌండ్ లో నిర్వహించుకుంటామంటూ స్థానిక తహశీల్దారుకి అర్జీ పెట్టుకున్నారు. అయితే.. శాంతిభద్రతల సమస్య అన్న నెపంతో తహశీల్దార్ అనుమతిని నిరాకరిస్తూ.. రహదారిపై (పంచంపట్టి- మున్నిలైకోట్టై రోడ్డు) అన్నదానం చేసుకోవాలంటూ పేర్కొన్నారు. అయితే.. దీనిని ఆలయ నిర్వాహకులు తీవ్రంగా వ్యతిరేకించారు. రహదారిపై అన్నదానం అనేది అంత సురక్షితం కాదని, అది అసాధ్యమని కూడా పేర్కొన్నారు. అయినా తహశీల్దార్ మొండి పట్టు వీడకపోవడంతో నిర్వాహకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ గ్రౌండ్స్ మాదంటూ వాదించిన క్రైస్తవ సంఘాలు…
అయితే.. పిటిషనర్ వేసిన దానిని క్రైస్తవ సమాజానికి నాయకత్వం వహిస్తున్న న్యాయవాది జాన్ విన్సెంట్ కోర్టులో వాదించారు. అదే మైదానంలో ఈస్టర్ వేడుకల కోసం నిర్మించిన వేదిక ఒకటి వుందని, దానిని క్రైస్తవ సమావేశాలకు వాడుకుంటామంటూ వాదించారు.దీనికి ఆధారంగా 1912 నాటి తహశీల్దార్ జారీ చేసిన జీవోను కూడా చూపించారు. అలాగే ఆ స్థలంలో క్రైస్తవేతర కార్యక్రమాలు నిర్వహించకూదని 2017 లో శాంతికమిటీ చేసిన తీర్మానాన్ని కూడా ఉటంకించారు. హిందువులు ఇప్పటి వరకూ తమ కార్యక్రమాల కోసం ఏనాడూ ఈ స్థలాన్ని ఉపయోగించలేదని, ఇప్పుడు అన్నదానానికి అనుమతిని ఇవ్వడం ద్వారా శాంతిభద్రతలకు, మత సామరస్యానికి భంగం వాటిల్లుతుందని వాదించారు.
ఓ ప్రభుత్వ స్థలం ఏ ఒక్క మతానికో చెందింది కాదు : హైకోర్టు
జస్టిస్ స్వామినాథన్ రికార్డులన్నింటినీ సమీక్షించారు. ఆ ఖాళీస్థలం అలాగే గ్రామనాథంగా వర్గీకరించబడిన ఆ బహిరంగ స్థలం ప్రభుత్వ ఆస్తి అని, ఏ మతానికీ చెందింది కాదంటూ జస్టిస్ స్వామి నాథన్ తీర్పునిచ్చారు.కె. రాజశేఖర్ వర్సెస్ జిల్లా కలెక్టర్, దిండిగల్ కేసులో 2021 డివిజన్ బెంచ్ ఆదేశాన్ని ఉటంకిస్తూకోర్టు “S.No.202/3 పై ఎటువంటి నిర్మాణం చేపట్టకూడదు” అని పునరుద్ఘాటించింది. అది ప్రభుత్వ మైదానమే అంటూ ధ్రువీకరించింది కూడా.
‘‘పట్టా భూమి కాకపోయినా… ప్రభుత్వ భూమి అయినప్పుడు అది మతపరమైన లేదా, మతపరమైన నేపథ్యంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకూ అందుబాటులో వుండాల్సిందే. ఓ పబ్లిక్ గ్రౌండ్ అన్ని వర్గాల వారికీ అందుబాటులో వండాలి. క్రైస్తవులు ఈస్టర్ రోజున మైదానాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ హిందువులు అదే స్థలంలో అన్నదానం నిర్వహించలేరన్న వాదనను మేము అంగీకరించం.’’ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా క్రైస్తవ సమూహం ఉదహరించిన 1912 నాటి ఉత్తర్వును తిరస్కరిస్తూ, సమానం, లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధమైన ఏ రాజ్యాంగ పూర్వ ఏర్పాటు కూడా స్వతంత్ర భారతంలో నిలబడదని హైకోర్టు పేర్కొంది. మనది లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమని, రాజ్యాంగ నిబంధనలు, నైతికతకు అనుగుణంగా లేని ఏదైనా రాజ్యాంగ పూర్వ ఏర్పాటును కొనసాగించడానికి అనుమతించమని హైకోర్టు తేల్చి చెప్పింది.ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సమాజం ఈ మైదానాన్ని ఉపయోగించడం కొనసాగించవచ్చని, కానీ అక్కడ ఏ కార్యక్రమమూ లేని సమయాల్లో ఆయా సమాజం వ్యక్తులు దానిని ఉపయోగించకుండా నిరోధించలేమని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది.
మరోవైపు శాంతిభద్రతలను సమస్యగా చూపిస్తూ అనుమతి నిరాకరించడాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మరియు 26 కింద ఉన్న హక్కును కేవలం అభ్యంతరం లేదా శాంతిభద్రతల భయంతో తిరస్కరించలేమంటూ పేర్కొంది.
ఈ సందర్భంగా జస్టిస్ స్వామి నాథన్ మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడటం పరిపాలన విభాగం విధి అని, చట్టబద్ధమన కార్యకలాపాలను అణచివేయడానికి అది సాకు కాకూడదని అన్నారు. పోలీసులు ప్రాథమిక హక్కులను అణచివేసే సులభమైన విధానాన్ని ఎంచుకోకూడదని,శాంతి భద్రతల సమస్య తలెత్తితే, దానిని పరిష్కరించాలని కూడా జస్టిస్ స్వామి నాథన్ సూచించారు.





