ArticlesNews

జ్ఞానం ఎలా లభిస్తుంది?

45views

పాశ్చాత్యులు ప్రాచీన కాలం నుంచి భౌతికవాదులే. వారి వాదనలన్నింటికీ తర్కమే ప్రమాణం. మన వేదాంతశాస్త్రం తర్కాన్ని ఆత్మజ్ఞానానికి అవరోధంగానే భావిస్తుంది. భౌతికవాదులకి భిన్నంగా సోక్రటీసు సదాచారాన్ని పాటించడం వల్లనే జ్ఞానం లభిస్తుందని చెప్పాడు. అతడి శిష్యులు అతని సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకుపోయారు కానీ, భౌతికవాదులు మాత్రం వాటిని నీతులు చెప్పడంగానే పరిగణించారు.

డెమాక్రటీస్‌ (‌సా.పూ. 460-357) అభిప్రాయం ప్రకారం, ‘ఇంద్రియాల వల్లనే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఒకచోట సత్యంగా కనిపించింది మరొకచోట అసత్యంగా కూడా మారిపోవచ్చు.’ అతని సిద్ధాంతంలో మానవ అనుభూతికి మాత్రమే సర్వాధిక మహత్వం ఉంది. వితండవాదులు (సోఫిస్టులు) చెప్పేది కూడా ఇదే.

భౌతికవాదుల దృష్టిలో, ‘ధార్మిక ప్రచారం వల్ల తత్త్వశాస్త్ర పురోగతి కుంటుబడుతోంది. మానవుని మేధకు పరిమితులు ఏర్పడుతున్నాయి. ధార్మికులకు తత్త్వజ్ఞానం లభించదు. ప్రతి మానవుడిలో దుర్భేద్య మైన అంధకారం స్వభావసిద్ధంగా ఉంటుంది. అందువల్లనే ప్రకృతి కూడా రహస్యభూతంగా ఉండిపోతోంది.

సిద్ధాంత రీత్యా భౌతికవాదులు ధార్మికవాదాన్ని చాలా వికృతరూపంలో వ్యక్తం చేస్తుంటారు. దహించబడుతున్నవాడు దహించే వస్తువుగా ఉండలేడు. అలాగే జ్ఞాత (తెలుసుకుంటున్నవాడు) జ్ఞానం ఒకటి కావడానికి అవకాశం లేదు.

ఒక వస్తువు రూపాన్ని చెవుల ద్వారా తెలుసుకోవడం సాధ్యం కాదు. కన్నుల ద్వారా మాత్రమే తెలుసుకోగలం. సరిగ్గా అలాగే శబ్ద స్పర్శాది గుణపంచకాల ద్వారా మాత్రమే పదార్థం ఇంద్రియ గోచరం అవుతుంది. అంతమాత్రాన ఇంద్రియాల ద్వారా మాత్రమే అన్నింటినీ తెలుసుకోజాలం. మన గ్రహణ పరిధికి మించిన విషయాలు, కేవలం అనుమానం లేదా శబ్దప్రమాణం ద్వారా మాత్రమే తెలుసుకోగలం.

వ్యక్తిగతమైన బుద్ధి పరిణతిని బట్టి సూక్ష్మం బోధపడుతుంది. అందువల్లనే తర్కాన్ని అనుసరించినప్పుడు ఒక వ్యక్తి గొప్ప తెలివితేటలు కలవాడైతే అతను చెప్పింది సిద్ధాంతం అవుతుంది. అయితే ఆ తరువాత ఎప్పుడైనా వేరే ఏదైనా పక్షానికి చెందిన వ్యక్తి ఇతనికంటే అధిక బుద్ధిమంతుడైతే మొదటివాడి సిద్ధాంతం పనిచేయడం మానేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో జ్ఞానం కూడా అస్థిరంగా ఉండిపోవలసి వస్తుంది.

కౌశల్యం కలిగిన మానవులు గొప్ప ప్రయత్నంతో అర్థాన్ని తర్కసిద్ధంగా రూపొందిస్తుంటారు. ఆ అర్థాన్ని మరోరకమైన కౌశల్యం కలిగిన తార్కికులు తమదైన అనుమాన ప్రమాణం-తర్కాల ద్వారా మరోరకంగా రూపొందిస్తుంటారు. ఇదే విధంగా పూర్వం ఒక ఊహతో సిద్ధపడిన అర్థాన్ని ఖండించి నవీన అర్థాన్ని కల్పిస్తారు. మళ్లీ వారి వాదాన్ని ఖండించి మరో కొత్త అర్థం సిద్ధమవుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక తత్త్వాన్ని నిర్ణయించడం కోసం చాలా ముందు జాగ్రత్తతో తర్కాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది.

సోక్రటీస్‌ అభిప్రాయంలో, ‘సదాచారాన్ని పాటించడం ద్వారా మాత్రమే సమ్యక్‌ ‌జ్ఞానం లభిస్తుంది. అట్టి జ్ఞానం అందరు మానవులలో ఏర్పడే సామాన్య జ్ఞానం కంటే భిన్నమైనదై ఉంటుంది. సానుకూల ఘటనల ద్వారా కార్యకారణ సంబంధంతో సమ్యక్‌ ‌జ్ఞానం ఉత్పన్నం కావడం సంభవిస్తుంది. సమ్యక్‌ ‌జ్ఞానం ఉత్కృష్ట గుణం. దీనికి వ్యాపకత్వము… గుణవిచారణల వల్ల కలుగుతుంది.’

కొంతమంది తత్త్వజ్ఞుల దృష్టిలో, ‘ఎవరి జ్ఞానమైనా, ఏ జ్ఞానమైనా సంశయించ దగినదై ఉంటుంది. ఎట్టి జ్ఞానమైనా నిశ్చయాత్మకం కానేరదు’. అట్టివారి అభిప్రాయాన్ని నిరాకరిస్తూ సోక్రటీస్‌, ‘‌దేవత ఒక విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పాలని అనుకోదు. అందువల్ల వారు సంశయాక్రాంతులు అవుతుంటారు. సదాచారంతో దేవతానుగ్రహం పొందడం ద్వారానే సమ్యక్‌ ‌జ్ఞానం ఉత్పన్నం కావడం సంభవమే కానీ అసంభవం ఎంతమాత్రం కాదు’ అని చెప్పాడు.

భౌతికవాదుల అభిప్రాయంలో సోక్రటీస్‌ ‌తత్త్వం నీతివిషయకమైనది మాత్రమే. అతడు వైజ్ఞానిక అన్వేషణ కంటే ఆధ్యాత్మిక కల్పనలకే ఎక్కువ ప్రాముఖ్యమిచ్చాడు. అతడి అభిప్రాయంలో, ‘కేవల బ్రహ్మము ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందే విషయం కానే కాదు. అంతరాత్మలోని తత్త్వానుభూతి చేత ఉత్పన్నం అవుతుంది. న్యాయం, సదాచారం అనేవి సుబుద్ధి కలిగిన మనుష్యులకు ఆంతరిక గుణమై ఒప్పుతుంది.’ అతడి ఈ తత్త్వబోధ శబ్దార్థ జ్ఞానాలకు సంబంధించిన విషయం మాత్రమే. బాహ్యజ్ఞానంపై ఆపేక్షతో ఆంతరిక జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చి, దాని గురించి ఎక్కువగా చెప్పాడు.

భౌతికవాద సిద్ధాంత పద్ధతి వల్ల వారి తత్త్వశాస్త్రంలో అనుభవానికి, ప్రయోగానికి ప్రాధాన్యం ఉంటుంది. తత్త్వం అనేది కృతబుద్ధి చేత గ్రహించ వలసి ఉంటుంది. అంటే పరమేశ్వరుని అనుగ్రహం చేత సంప్రాప్తించినది, కొంత రహస్యమయమైన ఆత్మ సాక్షాత్కారం ద్వారా మాత్రమే దాని గురించిన (తత్త్వాన్ని లేదా ఆత్మను) జ్ఞానాన్ని పొందడం సాధ్యమవుతుంది.

ఇతర గ్రీకుల మార్గాలు కూడా ఇదే విధంగా ‘తర్కం ద్వారా తత్త్వాన్వేషణ చేయగలుగుతాం’ అనే నమ్మకంపై ఆధారపడి ఏర్పడ్డాయి. ప్లేటో అభిప్రాయం ప్రకారం, ‘భౌతిక వస్తువులను సత్య పరిచయాన్ని కలిగించేవిగానే భావించాలి. సంఘటనలు అసంపూర్ణంగా, భ్రమింప చేసేవిగా ఉంటాయి. అందువల్ల ఏ సంఘటనకైనా ఏదో ఒక గంభీరమైన సత్యం మూలమై ఉంటుంది. దానినే ‘శాస్త్రీయ నియమం’గా చెబుతుంటారు. సృష్టి సర్వమూ ఆ నియమాన్ని అనుసరించి ఉంటుంది. ఆ నియమాల ఆధారంగానే ఘటన లపై వ్యాఖ్య కూడా జరుగుతుంది. అదే సమయంలో మూలభూతమైన శాస్త్రీయ నియమం కూడా తెలియబడుతూ ఉంటుంది.’

హిందీమూలం : కరపాత్రీ స్వామి

అనువక్త : నేతి సూర్యనారాయణశర్మ