
‘ఆధ్యాత్మికతలో పొందుపరిచిన శాస్త్రీయత.. సర్వ మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడే ఆవిష్కరణలతోనే విజ్ఞానం వికసిస్తుంది’ అనే సత్యాన్ని హృదయాలను హత్తుకునేలా బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించిన విజ్ఞాన మేళా అమితంగా ఆకట్టుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని హయ్యర్ సెకండరీ స్కూల్‌లో సనాతన ధర్మం, శాస్త్రీయ దృక్పథంతో కూడిన విజ్ఞాన మేళాను ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జేరత్నాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన 150 మంది బాలవికాస్ గురువులు, 250 మంది చిన్నారులు సృజనాత్మకత, భక్తి, శాస్త్రీయతను మేళవించి ప్రదర్శించిన 170 వినూత్న నమూనాలను తిలకించి వారిని అభినందించారు.
మేళాలో సత్యసాయి ఆధ్యాత్మిక సందేశాలు, ప్రేమ, శాంతి, సేవాతత్వం, శాస్త్రీయత ఉట్టిపడే దివ్య ఉపన్యాసాలు, చిన్న చిన్న కథల నుంచి శాశ్వత సత్యాలను వెలికితీసి, వాటిని సులభంగా అర్థమయ్యే దృశ్యరూపంలో ఆకర్షణీయంగా ప్రదర్శించారు. రెండు రోజుల పాటు మేళా సాగనుంది. కార్యక్రమంలో సత్యసాయి సేవాసంస్థల జాతీయ సేవా విభాగం సమన్వయకర్త కోటేశ్వరరావు, శశిబాల, రాష్ట్రసాయి సంస్థల అధ్యక్షుడు లక్ష్మణారావు, బాలవికాస్ గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు.





