
కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కడపజిల్లా కందిమల్లాయపల్లె (బ్రహ్మంగారి మఠం)లో నివాసం ఉన్న మట్టి మిద్దె మోంథా తుపాన్ వర్షం ధాటికి తెల్లవారుజామున కూలిపోయింది. దీనిపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్రహ్మంగారి ఆనవాళ్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను మఠం నిర్వాహకులు విస్మరించడం, ర చరిత్రను పరిరక్షించుకోవాలనే స్పృహ లేకపోవడం ఈ దుస్థితికి కారణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి 1693లో సజీవ సమాధి అయ్యారు. అటు తర్వాత గ్రామస్తులు, భక్తులు వీరబ్రహ్మేంద్రస్వామి నివాసమున్న రెండు కొట్టాల స్థానంలో మట్టి మిద్దె ఏర్పాటు చేశారు. 1982లో ముందు భాగంలో భక్తులు ఆధునికీకరణ చేపట్టారు.మరోవైపు శిథిలావస్థకు చేరిందంటూ పూజలు చేసుకునే అవకాశం లేకుండా నివాసానికి తాళాలు వేసిన నిర్వాహకులు, తదుపరి పరిరక్షణ చర్యలపై శ్రద్ధ చూపలేదని భక్తులు మండిపడుతున్నారు.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన నివాసం భారీ వర్షాలకు కూలిపోయింది. భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరో ఐదు నెలల్లో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపడతామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.ఆయన బ్రహ్మంగారి నివాసాన్ని బద్వేల్ ఆర్డీవో చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మఠం నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు. బ్రహ్మంగారు నివాసం ఉన్న చోట ఒకవైపు మాత్రమే మిద్దె కూలిపోయిందని.. మరోవైపు బాగానే ఉందన్నారు అయితే భక్తుల సౌకర్యం కోసం పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టి భక్తులకు అందుబాటులో తేవాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు కార్తీక్, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, ఎండోమెంట్ ఏసీ మల్లికార్జునప్రసాద్, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, దేవాదాయ శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.
 
			




