News

కృష్ణ జన్మభూమి మధుర విముక్తి కోసం ‘‘బ్రజ్-టు-కాశ్మీర్’’ యాత్ర..

43views

శ్రీ కృష్ణ జన్మభూమి విముక్తి కోసం మరో సారి సాధు సంతువులు తమ గళాన్నెత్తారు. అలాగే బ్రజ్ మండల్ అంతటా మాంసం, మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కూడా సాధు సంతులు డిమాండ్ చేస్తున్నారు. మధురలోని ఒరియా బాబా ఆశ్రమంలో విశ్వ నారాయణ మహాయజ్ఞం, శ్రీ కృష్ణ జన్మభూమి సంఘర్ష్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకి సంబంధించిన సాధు సంతులు, మహంతులు,ఇతర దేశాల్లో నివసిస్తున్న హిందూ ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్రస్ట్ అధ్యక్షుడు దినేష్ ఫలహరి అధ్యక్షత వహించి, ట్రస్ట్ అమెరికా అధ్యక్షుడు ప్రశాంత్ త్యాగి, కాలిఫోర్నియా చాప్టర్ అధ్యక్షుడు మనీష్ అరోరాతో కలిసి నిర్వహించిన శ్రీ లక్ష్మీ నారాయణ్ మహాయజ్ఞంతో ఈ సమావేశం ప్రారంభమైంది. కృష్ణ జన్మభూమి విముక్తి కోసం పోరాడడానికి తమకు ఈశ్వరుడు తగిన బలాన్ని ప్రసాదించాలని, జాతి మొత్తం అందుకు కదలిరావాలని మహాయజ్ఞం సందర్భంగా కోరారు.

కృష్ణుడి పవిత్ర జన్మస్థానానికి సరైన ఆధ్యాత్మిక వైభవాన్ని తిరిగి తీసుకురావాలని, దీని పునరుద్ధరణ కోసం అందరూ పని చేయాలని సాధు సంతులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఓ నినాదాన్ని కూడా సాధు సంతులు తీసుకొచ్చారు. ‘‘అయోధ్య మనదే. ఇప్పుడు మధుర వంతు’’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించారు.

ఇక.. ప్రశాంత్ త్యాగి మాట్లాడుతూ ప్రపంచమంతా కృష్ణుడి పవిత్ర భూమే అని, భారత్ లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా శ్రీకృష్ణ జన్మభూమి విముక్తి కోసం పోరాడతామని, అవగాహన కూడా కల్పిస్తామని ప్రకటించారు.

ఇక.. బ్రజ్ మండల్‌లో మాంసం మరియు మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని ట్రస్ట్ ఉపాధ్యక్షులు మనీష్ అరోరా మరియు ప్రవీణ్ శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, కృష్ణుడి దివ్య భూమిగా బ్రజ్ యొక్క పవిత్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.ఇలాంటి కార్యకలాపాలు కృష్ణుడి పవిత్ర భూమిని కలుషితం చేస్తాయని, ఆధ్యాత్మిక వాతావరణానికి పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. బ్రజ్ ప్రాంతాన్ని మొత్తం తీర్థస్థలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

శ్రీ కృష్ణ జన్మభూమి సంఘర్ష్ ట్రస్ట్ మరియు బ్రహ్మ కీర్తి రక్షక్ దళ్ సంయుక్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బ్రజ్-టు-కాశ్మీర్ ప్రజా చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు సాధు సంతులు ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా శ్రీకృష్ణుడు పవిత్ర జన్మభూమిపై హిందువుల అందరిలోనూ చైతన్యం తీసుకొస్తామని, హిందువులను ఏకం చేస్తామని, దీని ద్వారా హిందువుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా తీసుకొస్తామని ప్రకటించారు. ఈ యాత్ర కేవలం మతపరమైందే కాదని ధార్మిక ఆధ్యాత్మికమేల్కొలుపు అని సత్ విజయ దాస్ తెలిపారు. మధురను విముక్తి చేసి, తిరిగి ఆధ్యాత్మిక వైభవాన్ని పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రకటించారు.