
తన పూర్వీకులు నివసించిన గ్రామాన్ని వెతుక్కుంటూ మారిషస్ నుంచి ఒడిశాకు వచ్చారో వ్యక్తి. సరిగ్గా 150 సంవత్సరాల క్రితం దీపావళి రోజు జగన్నాథ్ దాస్ అనే 25 సంవత్సరాల యువకుడు ఆలంఘియర్ నౌకలో కోల్‌కతా రేవు నుంచి బయలుదేరి ఒప్పంద కార్మికునిగా పనిచేసేందుకు మారిషస్ వెళ్లారు. 1912లో 62 సంవత్సరాల వయసులో మరణించిన ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన తదనంతరం నాలుగు తరాలు ఒడియా భాషలోనే మాట్లాడాయి. ఆ తరువాత మారిషస్ వాసులతో అనుబంధాలు పెరిగిపోయి వారు తమ భాషను మరిచిపోయారు. అయినప్పటికీ ఈ నేలతో ఉన్న భావోద్వేగ అనుబంధం జగన్నాథ్ దాస్ ఐదోతరం వారసుడు రామ్‌రజ్‌ను జజ్‌పుర్‌కు లాక్కొచ్చింది. తన పూర్వీకుల నేలను వెతుక్కుంటూ ఆయన ఇటీవల ఇక్కడకు చేరుకున్నారు. బైతరణి నది ఒడ్డున పూర్వీకులకు పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈ ప్రదేశానికి రావాలని నా మనసెప్పుడూ కోరుకునేది. బైతరణి నదిలో తన అస్థికలు కలపాలని మా పెదనాన్న చెప్పేవాడు. ఆయన చివరి కోరిక పూర్తి చేశాను’’ అని చెప్పారు. తన గ్రామమేదో కనుగొనేందుకు సహకారం అందించాల్సిందిగా జిల్లా కలెక్టరును, ఇతర ఉన్నతాధికారులను ఆయన అభ్యర్థించగా వారు అంగీకరించారు.





