News

గుత్తికొండ బిలంలో చీకటి మల్లయ్య

40views

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం.. 13వ శతాబ్దం నాటి భారతీయ సంస్కృతికి చిహ్నం.. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువైన ఆలయం.. శాలివాహనుల కాలంలో చరిత్రకెక్కిన గృచ్చాది పట్టణం.. ఇలా ఎన్నో విశేషాలకు గుత్తికొండ బిలం నిలయం.

బాపట్ల జిల్లా పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ బిలం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, కొండలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. బిలం నుంచి నూటొక్క సొరంగ మార్గాలు ఉన్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇవి చేజర్ల, కోటప్పకొండ, అమరావతి, త్రిపురాంతకం, ఎత్తిపోతల, అహోబిలం, శ్రీశైలం, తిరుమల అక్కడ్నుంచి నేరుగా కాశీకి కూడా మార్గం ఉన్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. బిలం లోపల రేణుకాబిలం, అహోబిలం, కత్తుల బిలం, కృష్ణాబిలం, నాగార్జున బిలం వంటి సొరంగాలున్నాయి. వీటిల్లో కొన్ని వేల సంవత్సరాల కిందట రుషులు, సిద్ధులు, యోగులు తపస్సు చేశారని ప్రతీతి. ముచికుంద మహామునికి దేవతలు ఇక్కడ యోగనిద్ర ప్రసాదించారు. పల్నాటి వీరుడు బ్రహ్మనాయుడు పల్నాటి యుద్ధం అనంతరం తన శేష జీవితాన్ని బిలంలోనే గడిపారు. బిలంలోని అంతర వాహినిలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది.

బిలంలో చీకటి మల్లయ్య, కొండపైన రాజరాజేశ్వరిదేవి, నాగేంద్రుడి ఆలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి, దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి కోనేటిలో పుణ్యస్నానం చేసి, చీకటి మల్లయ్య, రాజరాజేశ్వరిదేవికి పూజలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకానికి గమ్యస్థానంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుత్తికొండ బిలాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భక్తులు, పర్యాటకులు కోరుతున్నారు.