
వేదః శివః శివో వేదః
వేదాధ్యాయి సదా శివః
వేదమే శివుడు. శివుడే వేదం. ఈశ్వరుని ఉచ్ఛ్వాస, నిశ్వాసాలే వేదాలుగా చెబుతారు. ఆ పరమేశ్వరుడే స్వయంభువుగా వెలసి పాలేశ్వరునిగా పూజలందుకుంటున్న గ్రామం. యజ్ఞయాగాదులు, నిత్య వేదఘోషతో వేద నిలయంగా పేరొందింది పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం. గ్రామం నుంచి వేద పండితులుగా, సిద్ధాంతులుగా, ఘనాపాఠీలుగా ఎంతోమంది దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందారు.
తణుకు నియోజకవర్గంలో మండల కేంద్రంగా ఉన్న ఇరగవరం జనాభా 5585 మంది. కుటుంబాల సంఖ్య 1825. వీరిలో 250 వరకు బ్రాహ్మణ కుటుంబాల వారు ఉన్నారు. చాలా కుటుంబాల్లో వేదం, ఆగమనం, శాస్త్రం, జ్యోతిష్యం, స్మార్థం, మంత్ర శాస్త్రం తదితర కళలను అవపోసన పట్టి వేదపండితులు, ఘనాపాఠీలు, సిద్ధాంతులుగా ప్రసిద్ధి చెందినవారు ఉంటారు. తిరుమల తిరుపతి, విజయవాడ ఇంద్రకీలాద్రి, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాచలం అప్పన్న తదితర రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన ఎన్నో దేవాలయాలు, వేద పాఠశాలల్లోని ప్రముఖ వేద పండితుల్లో అధికంగా ఇరగవరం మూలాలు ఉన్నవారే ఉంటారని ప్రసిద్ధి. వేదాభివృద్ధికి చేసిన కృషికి సాంగత్రి వేదాచార్య, అహోరాత్రి పారాయణ, వేద తపస్వి, నిత్యాగ్నిహోత్రులుగా ప్రముఖుల నుంచి సత్కారాలు, పురస్కారాలను, గండభేరుండాలను అందుకున్నవారు ఎంతోమంది ఉన్నారు.
ఎందరో మహానుభావులు…
వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న బ్రహ్మశ్రీ తంగిరాల బాలగంగాధరశాస్త్రి, దేశవ్యాప్తంగా అనేక చోట్ల అహోరాత్ర వేదపారాయణలు చేసిన బ్రహ్మశ్రీ గుళ్ల్లపల్లి ఆంజనేయ ఘనాపాటి, యావత్ జీవితాన్ని వేదానికి అంకితం చేసిన గుళ్లపల్లి సీతారామశాస్త్రి, నిత్యాగ్నిహోత్రకులుగా, పంచాంగకర్తలుగా పేరొందిన సోమయాజి, ప్రేసపాటి పాలశంకర అవధాని, సంస్కృతంలోని ఆరు గ్రంథాలను తెలుగులోకి అనువదించిన గుళ్లపల్లి శ్రీరామశర్మ, ప్రముఖ సిద్ధాంతిగా పేరొందిన పీసపాటి వెంకప్ప సోమయాజి తదితర ఎందరో వేద పండితులు ఈ గ్రామానికి చెందినవారే.
గ్రామానికి చెందినవారు ఎందరో
తంగిరాల కృష్ణానందతిలక, తంగిరాల రామసోమయాజులు, పీసపాటి సుబ్బరాయశాస్త్రిలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని తామ్రపత్రాలు పొందారు. వీరిలోని తంగిరాల రామసోమయాజులు 36 ఏళ్లు ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. 1962లో అష్ట గ్రహ కూటమి వచ్చి అరిష్టాలు సంభవించినప్పుడు ప్రముఖ మంత్రవేత్త తంగిరాల సుబ్రహ్మణ్య సిద్ధాంతి, తంగిరాల బాలగంగాధర శాస్త్రి, పేసపాటి వెంకప్ప సోమయాజి సిద్ధాంతి తదితరులు దేశ క్షేమం కోసం 12 రోజులు స్వామివారికి అతిరుద్ర యాగం నిర్వహించినట్టుగా పెద్దలు చెబుతారు. ప్రస్తుత తరంలోనూ గ్రామానికి చెందిన ఎందరో వేదపండితులు పెద్దలు చూపిన మార్గంలో నడుచుకుంటూ దేశవ్యాప్తంగా జ్యోతిష్య, వాస్తు విషయాలపై ప్రజలకు పరిష్కార మార్గాలను చూపుతూ వేదాభివృద్ధికి కృషి చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటుంటారు. బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామకోటి చంద్రశేఖర వేద పాఠశాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు.
వేదపఠనం చేస్తున్న విద్యార్థులు
పూర్వం బ్రాహ్మణులు ఇరగవరంలో నిత్యం యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. వేద ప్రియుడైన ఈశ్వరుడు ఈ గ్రామానికి వచ్చి ఆకలితో పిల్లిగా మారి అక్కడి ఉట్టిలోని పాలు, పెరుగు, నెయ్యి ఆరగించేవారని చెబుతారు. పూజకు వినియోగించే ఈ ద్రవ్యాలు రోజూ మాయమైపోతుండటం చూసి గోసంరక్షకుణ్ణి కాపలాగా ఉంచారని, పిల్లి పాలు తాగుతుండటాన్ని గమనించి గొడ్డలితో కొట్టగా తల నాలుగు ముక్కలైందని, పిల్లి శరీరాన్ని విడిచిన ఈశ్వరుడు వేదపండితులు, పెద్దలకు కలలో ప్రత్యక్షమై పిల్లి శరీరం పడిన చోట ఉద్భవించిన శివలింగానికి ఆలయం నిర్మించాలని చెప్పాడని ఇక్కడ బహుళ ప్రాచుర్యంలో ఉంది. పాలగుండం, పాల వృక్షాల వనం, పాలరాతి శివలింగం, పాలబుడ్డి ఆకారంలో గుడి, పాలేశ్వరస్వామి వారి పేర్లతో పంచపాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పాలబుడ్డి ఆకారంలోని శివలింగాన్ని యోగ లింగంగా చెబుతారు.