News

భారత్‌ పై.. రెచ్చిపోయిన పాక్‌ మంత్రి

47views

భారత్‌పై పాకిస్తాన్‌ రక్షణ శాఖ మంత్రి అసిమ్‌ ఖవాజా నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్‌ సమాధి అవుతుందని ఓవర్‌గా కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది రెండు రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషించడం పాకిస్తాన్‌ ఇకనైనా మానుకోవాలని, భారత్‌ను రెచ్చగొట్టవద్దని ఆయన తేల్చి చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ 1.0లో చూపించిన సహనాన్ని ఆపరేషన్‌ సిందూర్‌ 2.0లో చూపించబోమని స్పష్టంచేశారు.

దీనిపై అసిమ్‌ ఖవాజా ఆదివారం సోషల్‌ మీడియాలో స్పందించారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్‌కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ 0–6 స్కోర్‌తో ఓడిపోయిందని అన్నారు. అయితే, 0–6 స్కోర్‌కు అర్థం ఏమిటన్నది అసిమ్‌ ఖవాజా వెల్లడించారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్‌ను సమాధి చేస్తామని హెచ్చరించారు.