News

స్వయంసేవకులపై కక్షగట్టిన స్టాలిన్ సర్కార్

40views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కక్షగట్టింది. ఈ విజయ దశమికి సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సంఘ్ ఆధ్వర్యంలో విజయ దశమి ఉత్సవాలు దేశమంతా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు అంతటా కూడా సంఘ్ ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

విజయ దశమి ఉత్సవ నిర్వాహణ కోసం సంసిద్ధమైన ఆరెస్సెస్ కార్యకర్తలపై స్టాలిన్ ప్రభుత్వం కేసులు మోపింది. అక్టోబర్ 2 న దేశమంతా విజయ దశమి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలోనే డీఎంకే ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టింది. చెన్నై, అంబూర్, ఈరోడ్ సహా అనేక జిల్లాల్లో స్వయంసేవకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చెన్నైలోని అయ్యప్పంతంగల్ లోని ప్రభుత్వ పాఠశాలలో శాఖ నిర్వహించేందుకు స్వయంసేవకులు తయారయ్యారు. కానీ ముందస్తు అనుమతి లేదంటూ 47 మంది స్వయంసేవకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన చట్ట విరుద్ధమైన సమావేశమని పోలీసులు ఆరోపిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత CR నంబర్ 496/25 u/s 189(3), 329(2) కింద FIR నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం ‘‘దక్షిణామూర్తి నేతృత్వంలో 45 మంది స్వయంసేవకులు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నిత్య శాఖ కోసం సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో అనుమతి లేకుండా శాఖ నిర్వహించారు.అదుపులోకి తీసుకున్నాం’’ అని పోలీసులు ప్రకటించారు.

దీంతో వెంటనే ఆరెస్సెస్ కి సంబంధించిన న్యాయ సలహా బృందం ఘటనా స్థలికి చేరుకుంది. అధికారులతో చర్చించారు. ‘‘ఇది శాంతియుత కార్యక్రమే. ఈ మైదానంలోనే చాలా సంవత్సరాలుగా నిత్య శాఖను నిర్వహిస్తున్నాం. అకస్మాత్తుగా విజయదశమి రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటి?’’ అని పేర్కొన్నారు. ఇక… ఇది స్పష్టంగా స్వయంసేవకులను బెదిరించే ప్రయత్నమే అని అన్నారు.

ఒక్క చెన్నైలోనే కాకుండా తమిళనాడు అంతటా ఇలాంటి ఘటనలే జరిగాయి.తిరుపత్తూరు జిల్లాలోని అంబూర్‌లో, కస్బా మందకరై ఈశ్వరన్ ఆలయం సమీపంలో విజయదశమి ఉత్సవం నిర్వహిస్తున్న 35 మంది స్వయంసేవకులను అంబూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జిల్లా సంఘచాలక్ మురళీ నేతృత్వంలో ఉదయం 9 గంటలకు శాఖ ప్రారంభమైంది. అయితే ముందస్తు అనుమతి లేదంటూ స్వయంసేవకులను అరెస్ట్ చేశారు. వారందర్నీ సాండ్రోకుప్పంలోని ఓ కమ్యూనిటీ హాలుకు తరలించారు. అయితే వీరిని సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు. అధికారికంగా ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు.

ఈరోడ్‌లో, ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ, ఈరోడ్ సౌత్ మరియు ఈరోడ్ తాలూకా పోలీసు పరిధిలోని రెండు ప్రదేశాలలో జరిగిన RSS కార్యక్రమాల్లో పాల్గొన్న 36 మంది స్వయంసేవకులపై Cr. No. 296/2025 u/s 189(2), 126(2), 292 of BNS-2023 కింద కేసు నమోదు చేశారు.

ఇక.. మాంగాడుతో సహా ఇతర ప్రాంతాలలో కూడా పోలీసుల ఒత్తిడి కారణంగా అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. కొన్ని చోట్ల రద్దైనట్లు కూడా స్వయంసేవకులు చెబుతున్నారు.చాలా జిల్లాల్లో, పోలీసులు ముందస్తుగా అనుమతి నిరాకరించారు. కొన్ని చోట్ల పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. శతాబ్ది ఉత్సవాలను అడ్డుకోవడానికి ఇది సమన్వయంతో చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది” అని స్వయంసేవకులు పేర్కొన్నారు.

నిజానికి ఆరెస్సెస్ లో ప్రతి రోజూ నియమిత సమయంలో, ఒకే స్థలంలో ప్రతి రోజూ నిత్య శాఖలు జరుగుతాయి. ఇవేమీ రాజకీయ కార్యకలాపాలు కావు. మత పరమైనవి కూడా కావు. నిత్య శాఖ అనేది రోజూ జరుగుతూ వుంటుంది. అలాంటి కార్యక్రమంపై తమిళనాడు పోలీసులు ముందస్తు అనుమతి లేదంటూ స్వయంసేవకులను అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం చూస్తుంటే కచ్చితంగా కక్ష సాధింపే అని స్పష్టంగా కనిపిస్తూనే వుంది.

ఈ విజయ దశమి నాటికి సంఘ్ ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో ప్రత్యేక కార్యక్రమాలు, పథ సంచలన్, ప్రత్యేక గోష్ఠులను సంఘ్ నిర్వహిస్తోంది. ఈ ప్రయత్నాలకు పోలీసు చర్యల ద్వారా ఆటంకాలు కలిగించాలని తమిళనాడు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది.