News

వనాలతో పర్యావరణ పరిరక్షణ

35views

ఆలయ పరిసరాల్లో ఔషధ వనాలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ చెప్పారు. తన స్వగ్రామమైన చిలకలూరిపేట మండలం బొప్పూడిలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయాలకు చెందిన భూముల్లో ఆదివారం దివ్యవనాల ప్రారంభోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ వనాల్లో సత్యసాయి సేవా సమితి, దేవాదాయశాఖ, అటవీశాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలు నాటారు. కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఎనిమిది మంది, ఒక విశ్రాంత న్యాయమూర్తి హాజరయ్యారు. జస్టిస్‌ బి.కృష్ణమోహన్, జస్టిస్‌ ఎ.వి.శేషసాయి మొక్కలు నాటాల్సిన అవసరాన్ని వివరించారు.

పండగలా మొక్కలు నాటి..
నక్షత్ర వనంలో 27 నక్షత్రాలకు సంబంధించిన 27 రకాల మొక్కలు నాటారు. రాశివనంలో 12 రాశులకు సంబంధించిన 12 రకాల మొక్కలను.. పంచవటి వనంలో అయిదు రకాల దేవతావృక్షాలను నాటారు.

నవగ్రహ వనంలోనూ తొమ్మిది మొక్కలను జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ వసంతలక్ష్మి దంపతులు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డాక్టర్‌ వై.లక్ష్మణరావు, జస్టిస్‌ అవధానం హరిహరనాథశర్మ, జస్టిస్‌ వెంకటజ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ ఊటుకూరు శ్రీనివాస్, జస్టిస్‌ వి.సుజాత, జస్టిస్‌ నైనాల జయసూర్య, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, గుంటూరు జిల్లా జడ్జి బి.కల్యాణ చక్రవర్తి, పల్నాడు కలెక్టర్‌ కృతికాశుక్లా, ఎస్పీ కృష్ణారావు తదితరులు మొక్కలు నాటారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు న్యాయమూర్తులను దివ్యవనాల వద్ద సన్మానించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి అధ్యక్షులు సీహెచ్‌ ఉమాధవ్, దేవాదాయశాఖ ఉప సంచాలకులు కె.బి.శ్రీనివాసరావు, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. బొప్పూడి ఆలయాల చరిత్రను డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు వివరించారు.