
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ – ఆర్‌ఎస్‌ఎస్ జ్యేష్ట ప్రచారక్, ఆదరణీయ శ్రీ మధుభాయ్ కులకర్ణి ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు దేవగిరిలో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు మాధవ్ వినాయక్ కులకర్ణి. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.
మధుభాయ్ కులకర్ణి 17-05-1938న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యను కర్ణాటకలోని చికోడిలో అభ్యసించారు. 1954లో కొల్హాపూర్‌లోని విద్యాపీఠ్ హై స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.
చికోడిలో నివసిస్తున్నప్పుడు, ఆయన ఆర్‌ఎస్‌ఎస్ శాఖలకు హాజరు కావడం ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతర యుగాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. 1958లో ముంబైలోని రూపరెల్ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ పట్టా పొందారు. కొంతకాలం ముంబై సేల్స్ టాక్స్ ఆఫీసులో పనిచేశారు. తరువాత, 1960-61లో బి.ఎడ్. పూర్తి చేశారు. 1962లో మధుభాయ్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అయ్యారు. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా, సోలాపూర్ విభాగ్‌లోని రావేర్-యావల్ తాలూకాలో ప్రచారక్‌గా పనిచేసిన తర్వాత, 1980 నుండి 1984 వరకు పూణే మహానగర్ ప్రచారక్‌గా, 1984 నుండి 1996 వరకు గుజరాత్ ప్రాంత ప్రచారక్‌గా ఉన్నారు. 1996 నుండి 2003 వరకు పశ్చిమ క్షేత్రానికి క్షేత్ర ప్రచారక్‌గా, 2003 నుండి 2009 వరకు అఖిల భారత బౌద్దిక్ ప్రముఖ్ గా వివిధ బాధ్యతలు నిర్వహించి, 2015 వరకు వారు అఖిల భారత కార్యకారిణి మండలి సభ్యులుగా ఉన్నారు.
సంఘ్ లో చేరిన కొత్త యువత కోసం ఆయన “అథాతో సంఘ్ జిజ్ఞాస” అనే పుస్తకం రాశారు. ఇది అనేక భాషలలోకి అనువాదమైంది. వృద్ధాప్యం కారణంగా, 1 నెల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.